ఆమె పేరు తోట అనూష. ఉస్మానియ విశ్వవిద్యాలయం నుంచి బీటెక్, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్‌లో పీజీ పట్టా పొందారు. హైదరాబాద్‌కు చెందిన ఈమె కర్నూలు జిల్లా ఓర్వకల్లుకు చెందిన శశిభరత్ రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. చిన్నప్పటి నుంచే క్రీడలపై ఆసక్తి ఉన్న ఈమెకు.... రోలర్ స్కేటింగ్‌లో తల్లిదండ్రులు శిక్షణ ఇప్పించారు. అలా స్కేటింగ్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించారు.
దక్షిణ భారత దేశం నుంచి తొలి మహిళగా రికార్డు...
దక్షిణ భారతం నుంచి రోలర్ హాకీ విభాగంలో దేశానికి ప్రాతినిద్యం వహించిన తొలి మహిళగా రికార్డు సాధించారు. మొత్తం 14 సార్లు జాతీయ స్థాయిలో పతకాలు సాధించారు. 2005లో దక్షిణ కొరియాలో జరిగిన 11వ ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్ షిప్ క్రీడల్లో వెండి పతకం గెలిచారు. 2004లో జర్మనీలో జరిగిన ఏడో ప్రపంచ మహిళల వరల్డ్ కప్ పోటీల్లో పాల్గొని సత్తా చాటారు. ఇండియా రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ కమిటీకి 2017లో రెఫరీగా ఎంపికయ్యారు. జాతీయ స్థాయి మహిళా జట్టుకు శిక్షణ ఇచ్చారు.