తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆన్​లైన్​ విద్యతో.. గ్రామీణ ఇంటర్ విద్యార్థుల అవస్థలు - ఆన్​లైన్​ విద్యతో గ్రామీణ విద్యార్థుల ఇబ్బందులు

పాఠశాల విద్యే కాదు... ఇంటర్ స్థాయిలోనూ ఆన్‌లైన్‌తో విద్యార్ధులకు కష్టాలు తప్పడం లేదు. సర్కారీ విద్యాసంస్థల్లో చదివే గ్రామీణ నిరుపేద విద్యార్థులు... డిజిటల్ విద్యను అందుకోలేకపోతున్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఇంటర్ చదివే విద్యార్ధులు తరగతులు నష్టపోతున్నారు. విద్యార్థులందరికి తరగతులు చేరేలా ఇంటర్ బోర్డు చర్యలు తీసుకుంటున్నా... క్షేత్రస్థాయిలో మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు.

intermideate rural students facing problems with online education
ఆన్​లైన్​ విద్యతో.. గ్రామీణ ఇంటర్ విద్యార్థుల అవస్థలు

By

Published : Sep 5, 2020, 5:31 AM IST

Updated : Sep 5, 2020, 10:17 AM IST

ఆన్​లైన్​ విద్యతో.. గ్రామీణ ఇంటర్ విద్యార్థుల అవస్థలు

ఆన్‌లైన్‌ విద్యా విధానంలో ఇంటర్ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, కస్తూర్బా పాఠశాలలు, గురుకులాల విద్యార్థులకు ఆన్‌లైన్ చదువులు అందని ద్రాక్షగానే మిగులుతున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సుమారు 65 ప్రభుత్వ జూనియర్ కళాశాలలుండగా... వీటిలో సుమారు 7వేల మంది విద్యార్థులు ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. ఇరవైకిపైగా కస్తూర్బాలతో పాటు గురుకులాల్లోనూ... ఇంటర్ తరగతులు ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి. వీరంతా ఆన్‌లైన్ విధానంలో విద్యనభ్య సించేందుకు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుకునే విద్యార్ధులంతా గ్రామీణ, నిరుపేద కుటుంబాలకు చెందిన వాళ్లే. టీసాట్, దూరదర్శన్, యూట్యూబ్ సహా పలు మార్గాల ద్వారా అందుబాటులో ఉన్నప్పటికీ ఆన్‌లైన్‌ నిరుపేదలకు అందటం లేదు. టీవీలున్నప్పటికీ పలుచోట్ల టీసాట్ ఛానల్ రాకపోవడం, మారుమూల ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయాలు ఇబ్బందికరంగా మారాయి. మొబైల్‌లో ఆన్‌లైన్ తరగతులు వినాలనుకున్న వారికి ఇంటర్ నెట్ పెద్ద సమస్యగా మారింది. తరగతులు వినేందుకు వందలు వెచ్చించి... డాటా రీఛార్జ్ చేయాల్సి వస్తుండగా... సిగ్నల్ లేని చోట విద్యార్థుల అవస్థలు అంతా ఇంతా కాదు. ఇలా రకరకాల కారణాలతో చదువుపై పూర్తిస్థాయి దృష్టి సారించలేకపోతున్నామని విద్యార్థులు వాపోతున్నారు.

డిజిటల్ సాధనాలు అందుబాటులో లేని వారిని కళాశాలకే రమ్మని చెబుతున్నా... కరోనా దృష్ట్యా విద్యార్థులు రావటానికి భయపడుతున్నారు. ఆన్‌లైన్ తరగతులు జరుగుతున్నప్పుడు వచ్చే సందేహాలను నమోదు చేసుకుని, తర్వాత నివృత్తి చేసుకోవటం సైతం కష్టంగా మారింది. తెలుగు మీడియం వారికి ఆంగ్లంలో పాఠాలు బోధించటం విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తోంది. నిరుపేదలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సులువైన ప్రత్యామ్నాయ మార్గాలనూ అన్వేషించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. సెప్టెంబర్ 1నుంచి తరగతులు ప్రారంభమైనప్పటికీ... పూర్తిస్థాయిలో పాఠ్య పుస్తకాల పంపిణీ జరగలేదు. పుస్తకాలు లేకుండా చదువు ముందుకు సాగెదేలా అన్నది విద్యార్థుల ప్రశ్నగా మారింది. కొత్తగా సిలబస్ మారినా... ఇప్పటికీ పుస్తకాలు కళాశాలలకు చేరలేదు.

Last Updated : Sep 5, 2020, 10:17 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details