పర్యటక శాఖలో వేగంగా, నిర్ణీత సమయంలో అనుమతుల కోసం సింగిల్ విండో ప్రారంభమైంది. దీనికోసం రాష్ట్ర పర్యటక సేవలను టీఎస్ఐపాస్తో అనుసంధానించారు. ఈ క్రమంలో టీఎస్ ఐపాస్ పోర్టల్‌లో సేవలను రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. హోటళ్లు, ట్రావెల్ ఏజెన్సీ, రెన్యువల్ ప్రక్రియ, ఈవెంట్స్ అనుమతులు సులభతరం కానున్నాయి.
టీఎస్ ఐపాస్‌తో పర్యటక శాఖ సేవలు అనుసంధానం - Integration of Telangana tourism services with TS iPass
టీఎస్ ఐపాస్‌తో రాష్ట్ర పర్యాటక సేవలను అనుసంధానం చేసినట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. టీఎస్ ఐపాస్ పోర్టల్‌లో నేడు పర్యాటక సేవలను ఆయన ప్రారంభించారు.

పర్యటకంలో సులభతర వాణిజ్యం తీసుకురావడం గొప్ప విషయమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణలో పర్యాటక అభివృద్ధి అవకాశాలున్నాయని తెలిపారు. హోటల్ నిర్మాణానికి 15 రకాల అనుమతులను 30 రోజుల్లో ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అనుమతి ఇవ్వని పక్షంలో 30 రోజుల తర్వాత డీమ్డ్ అప్రూవల్ ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలోని డ్యామ్‌ల వద్ద పర్యటకం అభివృద్ధి చేస్తామని మంత్రి పేర్కొన్నారు.
తెలంగాణకు ఘన చరిత్ర ఉందని, రాష్ట్రానికి పర్యటకంలో చాలా అవకాశాలున్నాయని మంత్రి తెలిపారు. పర్యటకంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రైవేటు వ్యక్తులు ముందుకు రావాలని కోరారు. భవిష్యత్తులో తెలంగాణ పర్యటకం మంచి వృద్ధిని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బేగంపేట్ ప్లాజా హోటల్లో జరిగిన ఈ కార్యక్రంలో పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ బోర్డ్ ఛైర్మన్ శ్రీనివాస్ పాల్గొన్నారు. టీఎస్-ఐపాస్ ద్వారా పరిశ్రమల్లోకి పెట్టుబడులు వచ్చినట్లు... పర్యటకంలో కూడా పెట్టుబడులు వస్తాయని పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు.
- ఇదీ చూడండి :రైతుల నిరసనలతో మూతపడ్డ టోల్‌ప్లాజాలు