అసలు జాబితాలోనే లేదు... ఫలానా పీఎస్ ఎస్‌హెచ్‌వో (స్టేషన్ హౌస్ అధికారి)గా తననే నియమించబోతున్నారంటూ కీలక విభాగంలో పనిచేస్తున్న ఓ ఇన్‌స్పెక్టర్ చాలా రోజులు జోరుగా ప్రచారం చేసుకున్నారు. అధికారిక ఉత్తర్వులు రాక ముందే అప్పటి వరకు నిర్వర్తిస్తున్న బాధ్యతల నుంచి తప్పుకున్నారు. తనకు సంబంధించిన సామగ్రిని తీసుకెళ్లిపోయారు.
బదిలీపై అక్కడికే వస్తున్నా.. అంతా సిద్ధం చేయండి..! - inspector over estimated about transfer
బదిలీ ఉత్తర్వులు రాక ముందే ఓ ఇన్‌స్పెక్టర్ చేసిన హడావుడి సైబరాబాద్ పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పాత బాధ్యతల నుంచి ముందే తప్పుకొని ‘ఈ రోజు రాత్రి ఉత్తర్వులు వస్తున్నాయి.. రేప్పొద్దునే వస్తా.. కొత్త స్టేషన్‌లో అంతా సిద్ధం చేయండి’ అంటూ సదరు ఠాణా సిబ్బందికి హుకుం జారీ చేయడం సంచలనంగా మారింది. తీరా చూస్తే బదిలీల జాబితాలో ఆయన పేరు లేదు.
అదే రోజు కొత్తగా బాధ్యతలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేయమంటూ తాను బదిలీ అవుతానన్న పీఎస్ సిబ్బందికి ఫోన్ చేసి ఆదేశించారు. ఈ విషయాన్ని సదరు సిబ్బంది అప్పటికే అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఇన్‌స్పెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన ఒక్కసారిగా కంగుతిన్నారు. ఉత్తర్వులు రాక ముందే ఇలా చేయడమేమిటంటూ మనస్తాపానికి గురై సెలవులో వెళ్లిపోయాడు. ఆ తర్వాత 15 మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జాబితాలో హడావుడి చేసిన ఇన్‌స్పెక్టర్ పేరు లేదు. ఆ పీఎస్‌కు సంబంధించి ఎలాంటి మార్పులు జరగలేదు. దీంతో ఈ వ్యవహారం ఆ నోటా ఈ నోటా ప్రచారం జరిగి చివరకు ఉన్నతాధికారులకు చేరింది.
నాలుగైదు రోజులకే తప్పించాలంటూ..
రాచకొండ పరిధిలోనూ ఇటీవల కొందరు ఇన్‌స్పెక్టర్లను సీపీ మహేష్ భగవత్ బదిలీ చేశారు. కమిషనరేట్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఇన్‌స్పెక్టర్‌ను ఓ పీఎస్ ఎస్‌హెచ్‌వోగా నియమించారు. ఆయన కూడా ఒకటి, రెండ్రోజుల వ్యవధిలోనే కొత్త బాధ్యతలను స్వీకరించారు. ఇంతవరకు అంతా బాగానే జరిగింది. కానీ.. నాలుగైదు రోజుల తర్వాత తనను కొత్త బాధ్యతల నుంచి తప్పించాలంటూ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. అదనపు ఇన్‌స్పెక్టర్‌కు బాధ్యతలు అప్పగించి సెలవుల్లో వెళ్లిపోవడం రాచకొండ పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సదరు ఇన్‌స్పెక్టర్ వ్యక్తిగత కారణాల వల్లే సెలవుల్లో వెళ్లారని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.