పల్లె ప్రగతి కార్యక్రమాల పనితీరును పరిశీలించేందుకు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్రత్యేక బృందాలతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పల్లె ప్రగతి కార్యక్రమాలల్లో నాణ్యత పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వనున్నాయి. పల్లె ప్రగతి కార్యక్రమాల పురోగతిపై ప్రగతి భవన్‌లో అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు.
పల్లె ప్రగతికి విశేష జనాదరణ..
30 రోజుల పల్లె ప్రగతి కార్యక్రమం విశేష జనాదరణ పొందినట్లు కేసీఆర్ అభిప్రాయపడ్డారు. పల్లె ప్రగతిలో స్థానికులు భాగస్వామ్యం పంచుకోవడం శుభపరిణామంగా అభివర్ణించారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం సత్ఫలితాలను ఇవ్వడం సంతోషకరమని కేసీఆర్ అన్నారు. ప్రజలు చూపిస్తున్న ఉత్సాహం.. అధికారులు, ప్రజా ప్రతినిధుల్లో కరవైందని.. క్షేత్ర స్థాయి నుంచి ఫిర్యాదులు, సూచనలు వస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. వందశాతం ఫలితాలను రాబట్టాలంటే తనిఖీలు నిర్వహించి తద్వారా దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.