ద్వీపకల్ప భారత దేశానికి నౌకా యానం ద్వారా వాణిజ్య సంబంధాలు మెరుగుపడటం ఒక అభివృద్ధికి కారణమైతే, నౌకాదళం (indian navy) ద్వారా మన జలాలను రక్షణ అవసరాలకు వినియోగించుకోవడం, అంతర్జాతీయంగా పలు దేశాల నౌకాదళాలతో కలిసి రక్షణ అంశాలపై పరస్పరం కలిసి పనిచేయడం వంటి ప్రథమ కర్తవ్యాలను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ బాధ్యతను సక్రమంగా నెరవేర్చేందుకు త్రివిధ దళాలలో నౌకాదళానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. పదాతి, వాయు సేనలతో సమన్వయం చేసుకుంటూ, రక్షణ అవసరాల కోసం ఎప్పటికప్పుడు కొత్త యుద్ధ నౌకలను సమకూర్చుకుంటోంది. ఈ క్రమంలోనే ప్రాజెక్టు 15 బీ నౌకల తయారీని ఆరంభించింది. ముంబైలోని నౌకానిర్మాణ సంస్థలో ఈ నౌకల తయారీకి శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఐఎన్ఎస్ విశాఖపట్నం(INS visakhapatnam), ఐఎన్ఎస్ మర్మగోవా, ఐఎన్ఎస్ ఇంఫాల్, ఐఎన్ఎస్ సూరత్ యుద్ధ నౌకలను నిర్మిస్తున్నారు. 2012లో ఈ నౌకల నిర్మాణానికి ఆమోదం లభించింది. ఈ సీరిస్ లో తొలి నౌకకు ఐఎన్ఎస్ విశాఖపట్నంగా నామకరణం చేసి 2015లో నిర్మాణాన్ని ప్రారంభించారు.
ప్రాజెక్టు 15 బీ సిరీస్‌తో అత్యాధునిక యుద్ధనౌక నిర్మాణం..
ప్రాజెక్టు 15 బీ సిరీస్(project 15B Series)లో ఈ అత్యాధునిక యుద్ధ నౌక నిర్మాణం జరిగింది. పూర్తి దేశీయ పరిజ్ఞానంతో భారత నౌకాదళం అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. ఈ నౌకను ఇండియన్ నేవీ రూపకల్పన(డిజైన్) చేసింది. 164 మీటర్ల పొడవు, 7500 టన్నుల బరువు ఉన్న ఈ యుద్ధ నౌక.. 30 నాటికల్ మైళ్ల గరిష్ఠ వేగంతో నీలి జలాలపై పరుగులు తీస్తుంది. యుద్ధానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే విధంగా.. ఆయుధ సామగ్రిని అమర్చేందుకు వీలుగా విశాలమైన డెక్ ఉంటుంది. ఇందులో ఎప్పుడూ రెండు యుద్ధ హెలీకాప్టర్‌లు దిగేందుకు అనువుగా నిర్మాణం చేపట్టారు.
ఈ నౌక ప్రత్యేకతలలో..
యుద్ధ సామగ్రి శత్రు రాడార్ల కంటికి చిక్కకుండా, రాడార్లకు అందకుండా, భద్రపర్చడం ఒకటైతే.. అత్యాధునిక రెండు రాడార్ లు నిరంతరం పరిసరాలను పరిశీలిస్తూ యుద్ధంలో పాల్గోనేందుకు వీలుగా అన్ని రకాల సమాచార వ్యవస్ధలు పనిచేసేట్టుగా(ins visakhapatnam design) అమర్చారు. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం ఈ నౌకకు ఒక హంగు అయితే, నౌక అన్ని వైపులా ఫిరంగులు, ఎకె 630 గన్ లు, 76 ఎంఎం మీడియం రేంజ్ గన్‌లు, క్లోజ్ రేంజ్ గన్‌లు, అత్యంత బరువైన టార్పెడోలు, ఎయిర్ సర్వేవలెన్స్ రాడార్‌లు, బౌ మౌంటెడ్ హంసా ఎనర్జీ సోనార్‌లు, శక్తి ఎలక్ట్రానిక్స్ సర్వెవలెన్స్ సిస్టమ్స్, కవచ్ కార్ప్, యాంటీ టార్పెడో సిస్టమ్స్‌ను అమర్చారు. నౌక నుంచి గాలిలోకి, నీటిలోకి, మరో నౌక పైకి కదులుతున్న లక్ష్యాలను చేధించే విధంగా.. మిస్సైళ్ల ప్రయోగం శత్రు భయంకరంగా చేసేందుకు ఏర్పాటు చేశారు. అన్నింటికంటే ముఖ్యంగా ఈ నౌక ముందు భాగంలో దేశీయంగా తయారైన బ్రహ్మోస్ క్షిపణి అమర్చి ఉంచారు.