మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఐదోరోజు ఏపీలోని కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో సీబీఐ విచారణ జరుపుతోంది. వివేకా మాజీ కారు డ్రైవర్ దస్తగిరిని వరసగా ఐదోరోజు సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇతనితోపాటు వైకాపా కార్యకర్త కిరణ్ కుమార్ యాదవ్ కూడా వరసగా మూడు రోజు సీబీఐ విచారణకు హాజరయ్యారు. వివేకా హత్య జరగడానికి 15 రోజుల ముందు కిరణ్ కుమార్ యాదవ్ వివేకాను కలిసినట్లు సీబీఐ ప్రాథమిక సమాచారం సేకరించింది. హత్య జరిగిన రోజు అనుమానాస్పదంగా తిరిగిన వాహనాల గురించి సీబీఐ అధికారులు ఆరా తీశారు. రవాణాశాఖ ఇచ్చిన సమాచారంతో పులివెందుల వాసులు ఇన్నోవా యజమాని రవి, డ్రైవర్ గోవర్ధన్‌ను విచారించారు.
VIVEKA CASE: వైఎస్ వివేకా హత్య కేసులో కొనసాగుతున్న విచారణ - kadapa crime
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. పులివెందుల వాసులు రవి, డ్రైవర్ గోవర్ధన్‌ను అధికారులు విచారించారు.
మధ్యాహ్నం కడప నుంచి రెండు సీబీఐ బృందాలు పులివెందులకు వెళ్లాయి. వివేకా ఇంటిని ఓ బృందం మరోసారి పరిశీలిస్తోంది. నిన్న రాత్రి దాదాపు 3 గంటలపాటు పరిశీలించిన సీబీఐ అధికారులు.. ఇవాళ మరోసారి పరిశీలిస్తున్నారు. మరో సీబీఐ బృందం పులివెందులలోని సునీల్ కుమార్ యాదవ్ ఇంట్లో తనిఖీలు చేస్తోంది. సునీల్ కుమార్ యాదవ్, కిరణ్ కుమార్ యాదవ్ ఇద్దరూ అన్నదమ్ములు. సునీల్ కుమార్ యాదవ్ వివేకాకు అత్యంత సన్నిహితుడు కావడంతో.. సీబీఐకి ఉన్న అనుమానాలతో సోదరులిద్దరినీ విచారిస్తోంది. దీంతోపాటు రవాణశాఖ అధికారులు కడపలో సీబీఐ విచారణకు హాజరయ్యారు. వివేకా హత్య జరిగిన రోజు అనుమానాస్పద వాహనాల వివరాలు సేకరిస్తున్నారు.
ఇదీ చదవండి:Bandi Sanjay: 'భూములు అమ్మితే గాని పూటగడవని స్థితికి దిగజార్చారు'