తెలంగాణ

telangana

ETV Bharat / city

ఎంసెట్‌లో ప్రతిభావంతులకు అన్యాయం.. 20 శాతం మిగిలిన సీట్లు - engineering seats allocation

ఏళ్ల తరబడి కొనసాగుతున్న నిబంధనలను మార్చకపోవడం వల్ల ఎంసెట్‌లో ఉత్తమ ర్యాంకులు వచ్చినవారు నష్టపోతున్నారు. ఈ పరిస్థితిని గుర్తించిన కొందరు అధికారులు.. నిబంధనల్లో మార్పులు చేయాలని సూచించినా విద్యాశాఖ పట్టించుకోవడంలేదు. దీంతో ప్రతిభావంతులకు ప్రముఖ కళాశాలల్లో డిమాండ్‌ ఉన్న సీఎస్‌ఈ సీట్లు దక్కడం లేదు. అదే సమయంలో ఏదో బ్రాంచి అని చేరిన వారికి జాక్‌పాట్‌ తగులుతోంది.

injustice to the talented students who have given eamcet exam
ఎంసెట్‌లో ప్రతిభావంతులకు అన్యాయం

By

Published : Nov 20, 2020, 7:24 AM IST

ఈసారి విద్యాశాఖ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ను రెండు విడతలకే పరిమితం చేసింది. 10 వేలలోపు ర్యాంకు పొందిన, కొన్ని సామాజిక వర్గాల విద్యార్థులకు ప్రభుత్వం నుంచి 100 శాతం బోధన రుసుం అందుతుంది. ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో సీట్లు వస్తాయో? రావోనని వారందరూ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొంటారు. ఫీజు చెల్లించాల్సిన అవసరం లేనందున ఇక్కడ కళాశాలల్లో చేరుతున్నట్లు సెల్ఫ్‌ రిపోర్ట్‌ చేస్తున్నారు. వారికి ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో సీట్లు వచ్చాయని తెలిసినప్పటికీ ఇక్కడ రద్దు చేసుకోవడం లేదు. దానివల్ల సీబీఐటీ, వాసవి తదితర పేరున్న కళాశాలల్లో ఎక్కువ సీట్లు ఖాళీగా ఉన్నాయి.

సీఎస్‌ఈ సీట్లకు డిమాండ్‌ ఉన్నందున ప్రముఖ కళాశాలల్లో రాకుంటే మరోచోట విద్యార్థులు ఈ బ్రాంచిని తీసుకుంటున్నారు. రెండు విడతల కౌన్సెలింగ్‌తో సరిపెట్టి వెంటనే కళాశాలలో చేరినవారు అక్కడే బ్రాంచీని మార్చుకునే (స్లైడింగ్‌) విధానాన్ని గురువారం ప్రారంభించారు. దాంతో ప్రముఖ కళాశాలల్లో ఇతర బ్రాంచీల్లో చేరిన వారికి ఇప్పుడు సీఎస్‌ఈ సీట్లు దక్కనున్నాయి. తర్వాత స్పాట్‌ ప్రవేశాల్లో కూడా ఎంసెట్‌ చివరి ర్యాంకర్లు, ఉత్తీర్ణులు కానివారు కూడా చేరే అవకాశం ఉంది.

నిబంధనల ప్రకారం ట్యూషన్‌ ఫీజు మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా.. అందుకు విరుద్ధంగా కొన్ని కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి రూ.లక్షలు గుంజేందుకు సిద్ధమయ్యాయని ఆరోపణలు వస్తున్నాయి. ఇతరచోట్ల సీట్లు వచ్చినా ఇక్కడ రద్దు చేసుకోవడం లేదని గమనించిన విద్యాశాఖలోని కింది స్థాయి అధికారులు కొంత ఫీజు వసూలు చేయాలని, దానివల్ల చేరకుంటే ఆ డబ్బులు పోతాయని సీట్లను రద్దు చేసుకుంటారని, అందుకు ఎంసెట్‌ ప్రవేశాల జీఓలో సవరణలు చేయాలని మూడేళ్ల క్రితమే ప్రతిపాదించినట్లు తెలిసింది. కన్వీనర్‌ కోటాలో మొత్తం సీట్లను కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేసేలా, స్లైడింగ్‌, స్పాట్‌ ప్రవేశాలనూ విద్యాశాఖే చేపట్టేలా మార్పులు చేయాలని అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details