1971 యుద్ధంలో భారత వీరుల విజయానికి గుర్తు.. నేవీ డే ప్రపంచంలో 4వ అతిపెద్ద నావికాదళంగా గుర్తింపు తెచ్చుకున్న భారత నేవీ.. దేశరక్షణ వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తోంది. శౌర్యానికి, వ్యూహ సన్నద్ధతకు, కార్యాచరణకు మారు పేరుగా నిలిచే భారత నావికాదళం.. అంతర్జాతీయ జలాల్లో శాంతి పరిరక్షణకు పాటు పడుతోంది. అనేక దేశాలతో చక్కని మైత్రీ బంధం కొనసాగిస్తూ...వివిధ నౌకాదళాలతో కలిసి పని చేయడం భారత నౌకాదళం మరో ప్రత్యేకత. దేశ రక్షణరంగంలో తనదైన ముద్ర వేస్తున్న భారత నావికదళం అందిస్తున్న సేవలకు గుర్తుగా ఏటా నౌకాదళ దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నాం. అయితే ఈ వేడుకలకు బీజం వేసింది.. 1971 నాటి భారత్-పాకిస్థాన్ యుద్ధం.
1971భారత్-పాక్ యుద్ధం సందర్భంగా భారత నౌకాదళం మెరుపుదాడితో పాకిస్థాన్‌ను గడగడలాడించింది. భారత యుద్ధనౌకలు డిసెంబర్ 4న కరాచీ హార్బర్‌పై దాడి చేసి.. పాక్‌ను దెబ్బతీశాయి. భారత నావికాదళం నిర్వహించిన అత్యంత విజయవంతమైన ఆపరేషన్‌లలో ‘ఆపరేషన్ ట్రైడెంట్ ఒకటి. ఈ మిషన్‌లో మన నావికాదళానికి ఎలాంటి నష్టం కలగకపోవడం విశేషం. కరాచీలో మైన్ స్వీపర్, డిస్ట్రాయర్, మందుగుండు సామగ్రిని తీసుకెళ్తున్న కార్గో నౌక, ఆయిల్ స్టోరేజ్ ట్యాంకులపై భారత నేవీ ప్రణాళిక ప్రకారం దాడులు చేసింది. పాకిస్థాన్‌కు భారీ నష్టం కలిగించింది. ఆపరేషన్ ట్రైడెంట్‌లో భారత్ తొలిసారిగా యాంటీ షిప్ మిసైల్స్ వాడింది. ఐఎన్ఎస్ నిపాత్, ఐఎన్ఎస్ నిర్ఘాత్, ఐఎన్ఎస్ వీర్ యుద్ధనౌకలు ఆపరేషన్‌లో పాల్గొని, లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తిచేశాయి.
గుజరాత్‌లోని ఓఖా పోర్టు ద్వారా మన నేవీ సిబ్బంది పాకిస్థాన్ జలాల్లోకి ప్రవేశించారు. ముందు మైన్ స్వీపర్ పీఎన్ఎస్ ముహఫీజ్పై దాడి చేసి, కరాచీలోని పాకిస్థాన్ నేవీ హెడ్ క్వార్టర్స్‌కు సిగ్నల్ పంపకుండా ఓడను విచ్ఛిన్నం చేశారు. ఐఎన్ఎస్ నిపాత్, ఐఎన్ఎస్ నిర్ఘాత్, ఐఎన్ఎస్ వీర్ సహా మరో 2 యాంటీ సబ్‌మెరైన్లు, ఐఎన్ఎస్ కిల్తాన్, ఐఎన్ఎస్ కాట్చాల్, ఐఎన్ఎస్ పోషాక్ అనే ఒక ఫ్లీట్ ట్యాంకర్ కూడా పాల్గొన్నాయి. ఈ బృందానికి 25వ మిసైల్ బోట్ స్క్వాడ్రన్ కమాండింగ్ ఆఫీసర్, కమాండర్ బాబ్రూ భన్ యాదవ్ నాయకత్వం వహించారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న చాలామంది ఇండియన్ నేవీ సిబ్బందికి శౌర్య పురస్కారం లభించింది. నేవీ డే సందర్భంగా ప్రతి సంవత్సరం ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద బీటింగ్ రిట్రీట్‌ను మన నావికాదళం ఘనంగా నిర్వహిస్తోంది.
భారత నౌకాయాన చరిత్ర అతి పురాతనమైంది. ఆధునిక కాలానికి వస్తే 1600 సంవత్సరంలోనే నౌకాయానం ద్వారా భారతదేశంలోకి విదేశీయులు వాణిజ్యం కోసం రావడం ముమ్మరం అయింది. అప్పటి నుంచి తీర ప్రాంత రక్షణ, సముద్ర జలాల్లో భద్రత, రక్షణలు ప్రాధాన్య అంశాలుగా మారాయి. భౌగోళికంగా హిందూ మహాసముద్ర ప్రాంతం ప్రపంచంలోనే అత్యధిక నౌకలు ప్రయాణించే ప్రాంతంగా గుర్తింపు తెచ్చుకుంది. ఏటా వేల సంఖ్యలో నౌకలు ఈ మహా సముద్ర ప్రాంతంలో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించడంతో రక్షణ కూడా అదే స్థాయిలో ప్రాధాన్యం సంతరించుకుంది.
స్వాతంత్య్రానికి పూర్వం కూడా మన దేశీయ సంస్థానాలకు చెందిన నౌకలు గస్తీ కోసం ఉండేవి. బ్రిటిష్ పరిపాలన కాలంలో ఇండియన్ రాయల్ నేవీగా వ్యవహరించే నౌకాదళంను ...1950 తర్వాత ఇండియన్ నేవీగా మార్పు చేశారు. కొన్నిరోజుల పాటు నౌకాదళ దినోత్సవం వేర్వేరు నెలల్లో జరిపేవారు. 1971 నుంచి ఆపరేషన్ ట్రైడెంట్ విజయానికి ప్రతీకగా డిసెంబర్ 4న నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో అతిపెద్ద నౌకాదళాల్లో భారత్ ముందు వరుసలో ఉంటుంది. 60 వేలకు పైగా నావికులు, అధికారులతో వందల సంఖ్యలో యుద్దనౌకలు, పదుల సంఖ్యలో జలాంతర్గాములు, 5 కమాండ్లలో అనునిత్యం సిద్ధంగా ఉంటాయి. తూర్పు ,పశ్చిమ, దక్షిణ, అండమాన్ నికోబార్ కమాండ్లు అధునాతన సాయుధ సంపత్తితో వ్యూహాత్మక మోహరింపులతో ఉంటాయి. చురుగ్గా కదిలే యుద్ద నౌకలు, వాటిని అనుసరించి వెళ్లే ఎయిర్ క్రాఫ్టులు, వాటికి కూడా తెలియకుండా సాగరగర్భంలో నిశ్శబ్దంగా రక్షణగా పంపే జలాంతర్గాములు వీటన్నింటికి మించి నావికుల ధైర్య సాహసాలు.. కొత్త సవాళ్లకు ఎల్లప్పుడూ సన్నద్ధంగా ఉండటం నౌకాదళం సమర్థతకు అద్దం పడుతోంది.
భారత సముద్ర జలాలలను , తీరాలను పరిరక్షించుకోవడం ఒక ఎత్తైతే దానికి అనుగుణమైన వ్యూహాత్మక భాగస్వామ్యాలను ఎన్నుకోవడం, స్నేహపూరిత దేశాల నేవీలతో సంయుక్త విన్యాసాలు నిర్వహించడం భారత నౌకాదళం ఎత్తుగడల పరిణితికి దర్పణంగా నిలుస్తుంటాయి. అగ్రదేశాలైన అమెరికా, రష్యా, జర్మనీ, జపాన్‌లే కాకుండా పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, ఇండోనేషియా, థాయ్‌లాండ్, సింగపూర్, శ్రీలంక వంటి దేశాలతో సంయుక్త విన్యాసాలు నిర్వహిస్తోంది. ఎప్పటికప్పుడు అంతర్జాతీయ జలాల్లో శాంతి వాతావరణాన్ని కాపాడటంలో ముఖ్య భూమిక పోషిస్తోంది...మన నావికాదళం. చతుర్భుజ కూటమితో కలసి నిర్వహించే మలబార్ విన్యాసాలు మరింత ప్రత్యేకం.
ఏపీలోని విశాఖ కేంద్రంగా ఉన్న తూర్పు నౌకాదళం ప్రాభవాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉంటాయి. నిత్యం యుద్ధసన్నద్ధతతో... ఎలాంటి పరిస్థితులనైనా ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటుంది భారత నేవీ. అత్యాధునిక విమానవాహక యుద్ధనౌక ఐ.ఎన్.ఎస్.విక్రాంత్ కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో నిర్మాణం ఉంది. పరీక్షలు పూర్తయిన తర్వాత 2022 యేడాదికి నౌకాదళంలో చేరనుంది. చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత ఉన్న తరుణంలో జల మార్గాల్లో ఎక్కడా ఎటువంటి సమస్యలు సృష్టించకుండా గట్టి పహారా కాస్తోంది నేవీ. ఇక్కడ మహిళలు సైతం కీలకపాత్ర పోషించటం మరో విశేషం. ఐఎన్ఎస్ శక్తి , ఐఎన్ఎస్ విక్రమాదిత్య యుద్ధనౌకల్లో మహిళా అధికారులు విధులు నిర్వహిస్తూ...సత్తా చాటుతున్నారు. ఇప్పుడున్న భారత నౌకాదళ హెలీకాప్టర్లు, యుద్ద విమానాలకు తోడుగా మరో 111 బహుళ ప్రయోజన హెలీకాప్టర్లు త్వరలోనే తూర్పు నౌకాదళంలో చేరే అవకాశం ఉండటంతో ...మన నావికాదళం బలాన్ని మరింత పెంచుకుని... దేశ రక్షణకు మరింత భరోసా అందించనుంది.