రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు స్వరాజ్యం సిద్ధించి 75 వసంతాలవుతున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా స్వాతంత్య్ర సంబురాలు అంబరాన్నంటాయి. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ త్రివర్ణ పతాకావిష్కరణ చేశారు. దర్బార్ హాల్ ఎదుట జరిగిన కార్యక్రమంలో పోలీసుల గౌరవవందనం స్వీకరించిన గవర్నర్.. రాజ్‌భవన్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపి మిఠాయిలు పంపిణీ చేశారు. అసెంబ్లీ ఆవరణలో సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి జాతీయపతాకాన్ని ఎగురవేశారు. శాసనమండలిలో మహాత్ముడి విగ్రహానికి నివాళులనంతరం, ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అసెంబ్లీ ప్రాంగణంలోని అంబేడ్కర్, మహాత్మాగాంధీ విగ్రహాలకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పూలమాల వేసి నివాళులర్పించారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో
బీఆర్కే భవన్‌లో గౌరవవందనం స్వీకరించిన సీఎస్ సోమేశ్‌కుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు. టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ఛైర్మన్ జనార్దన్‌రెడ్డి మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. లోకాయుక్త కార్యాలయంలో లోకాయుక్త జస్టిస్ రాములు, జీహెచ్ఎంసీ కార్యాలయంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి త్రివర్ణ పతాకం ఎగురవేశారు. జూబ్లీహిల్స్‌లోని సీఆర్పీఎఫ్ సౌత్ సెక్టార్ ప్రధాన కార్యాలయంలో ఐఎఫ్ మహేశ్ చంద్ర లడ్హా జాతీయ జెండా ఎగురవేశారు. జాతీయ స్థాయిలో తమ సెక్టార్‌కు 222 పతకాలు రావడం గర్వంగా ఉందని ఆయన తెలిపారు. సికింద్రాబాద్‌లోని రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ మైదానంలో దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో స్వాతంత్య్ర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. హైదరాబాద్ సింగరేణి భవన్‌లో సీఎండీ శ్రీధర్ జాతీయ జెండా ఎగురవేశారు. నాంపల్లిలోని ఖాదీ పరిశ్రమల కమిషన్ కార్యాలయంలో.. బోర్డు దక్షిణ భారత ఛైర్మన్ పేరాల శేఖర్‌రావు మువ్నన్నెల జెండాను ఎగురవేశారు.
జిల్లాల్లో మంత్రులు, పాలనాధికారులు
జిల్లాల్లో మంత్రులు, పాలనాధికారులు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గౌరవ వందనం స్వీకరించారు. కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్... కలెక్టర్ కర్ణన్‌తో కలిసి స్వాతంత్ర సమరయోధులను సన్మానించారు. జగిత్యాలలో కొప్పుల ఈశ్వర్, నిర్మల్‌లో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. నిజామాబాద్‌లో జరిగిన వేడుకల్లో మంత్రి ప్రశాంత్‌రెడ్డి గౌరవవందనం స్వీకరించగా... ఈ సందర్భంగా ప్రదర్శించిన శకటాలు ఆకట్టుకున్నాయి. మహబూబ్‌నగర్‌లో సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, వనపర్తిలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, నల్గొండలో జరిగిన వేడుకల్లో హోంమంత్రి మహమూద్ అలీ పంద్రాగస్టులో భాగంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సూర్యాపేటలో విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, మహబూబాబాద్‌లో గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ జాతీయజెండాను ఎగురవేశారు. హన్మకొండ పోలీస్ పరేడ్ మైదానంలో పతాకావిష్కరణ అనంతరం.. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. ఖమ్మంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మెదక్‌లో తలసాని శ్రీనివాస్‌యాదవ్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. మేడ్చల్‌లో జరిగిన జెండా పండుగలో కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, వికారాబాద్‌లో ఉపసభాపతి పద్మారావు గౌడ్, సైబరాబాద్ సీపీ కార్యాలయంలో సబితాఇంద్రారెడ్డి పాల్గొని... పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సంలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. సిరిసిల్లలో ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి... పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. కేసీఆర్ నాయకత్వంలో దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు.
పార్టీ కార్యాలయాల్లో
రాష్ట్రవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలు, పలు సంఘాలు జెండా పండుగను ఘనంగా నిర్వహించాయి. తెరాస రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ సెక్రటరీ జనరల్, ఎంపీ కేశవరావు జాతీయ పతాకావిష్కరణ చేశారు. గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి.... స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు అబిడ్స్ నెహ్రూ విగ్రహం నుంచి గాంధీ భవన్‌కు పార్టీ శ్రేణులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఎంబీ భవన్‌లో సీపీఎం జాతీయ నాయకుడు బీవీ రాఘవులు మువ్వన్నెల జెండా ఆవిష్కరించారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పతాకావిష్కరణ చేశారు. నాంపల్లిలోని తెలంగాణ జన సమితి కార్యాలయం వద్ద ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం... మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. పాతబస్తీ మదీనా ఎక్స్‌రోడ్ వద్ద మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని వైఎస్ఆర్ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తూడి దేవేందర్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. బంజారాహిల్స్‌లోని బసవతారకం ఆస్పత్రిలో ఆ సంస్థ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ పతాకావిష్కరణ చేశారు.
ఇదీ చదవండి:Farmer loan waiver: రూ.50 వేలలోపు మాత్రమే మాఫీ