రాజన్న సిరిసిల్లలో పురపాలక మంత్రి కె.తారకరామారావు స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు . సిద్దిపేట సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు జాతీయ జెండాను ఎగురవేశారు. కోవిడ్ కారణంగా వేడుకలను నిరాడంబరంగా నిర్వహిస్తున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి వివరించారు.
వరంగల్‌లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. వేడుకల అనంతరం పలు పథకాలకు సంబంధించిన లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మువ్వన్నెల జెండాను సినిమాపోటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎగురవేశారు. కరీంనగర్‌లో సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ జాతీయపతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా సమగ్రాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నట్లు వివరించారు. మహబూబ్‌నగర్‌లో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో గిరిజన శాఖ మంత్రి సత్యవతిరాఠోడ్ జాతీయ జెండా ఎగురవేసి గౌరవ వందనాన్ని స్వీకరించారు. వచ్చే ఆగస్టు 15 నాటికి కరోనా అంతరించిపోయి...ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.