తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రంలో వైభవంగా స్వాతంత్య్ర వజ్రోత్సవాలు

Independence Day Celebrations రాష్ట్రంలో స్వాతంత్య్ర దినోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ప్రభుత్వ, పార్టీ కార్యాలయాల్లోనూ జాతీయ జెండా రెపరెపలాడుతోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు జెండా వందనం చేశారు. వందేమాతరం నినాదంతో దేశ భక్తి చాటారు.

Independence Day
Independence Day

By

Published : Aug 15, 2022, 1:49 PM IST

Independence Day Celebrations:స్వాతంత్య్ర వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని శాసనసభ ఆవరణలో సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి మహాత్ముడికి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించారు. శాసనమండలిలో ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి త్రివర్ణ పతాకం ఎగుర వేశారు. ఎమ్మెల్సీలందరూ జెండా వందనం చేశారు. బీఆర్కే భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ జాతీయ పతాకం ఆవిష్కరించారు. ఇందులో సచివాలయ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. లకిడికపూల్‌లోని డీజీపీ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవాలు ఘనంగా జరిగాయి. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అడిషనల్‌ డీజీపీ శివధర్‌ రెడ్డి... జెండా ఎగురవేశారు.

స్వాత్రంత్యం కోసం పోరాడిన మహానీయుల లక్ష్య సాధన కోసం పాటుపడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని తెరాస సెక్రటరీ జనరల్ కేశవరావు పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్ లో జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రజల్లో దేశభక్తిని రగిల్చేందుకు 15 రోజులపాటు స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదే స్ఫూర్తితో భవిష్యత్ లోనూ పనిచేయాలని కేశవరావు పేర్కొన్నారు.

జనగామ జిల్లా దేవరుప్పల్‌లో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాల్గొన్నారు. స్థానికంగా ఉన్న ప్రశాంతి విద్యానికేతన్‌లో జాతీయజెండా ఆవిష్కరించారు. యువత సమాజం, దేశం గురించి నిత్యం ఆలోచించాలని బండి సంజయ్‌ సూచించారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్ ఆవరణలో స్వతంత్ర వజ్రోత్సవాలు ఘనంగా జరిగాయి. పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ జాతీయ పతాకం ఆవిష్కరించారు. ఉత్సవాల్లో ఏఐసీసీ కార్యదర్శి నదీమ్‌ జావిద్‌ తోపాటు సీనియర్‌ నేతలు అంజన్‌ కుమార్‌ యాదవ్‌, గీతారెడ్డి, షబ్బీర్‌ అలీ పాల్గొన్నారు.

కొవిడ్‌ సోకడంతో హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో రేవంత్‌ రెడ్డి జెండా ఆవిష్కరించారు. దేశాన్ని విభజించాలని చూస్తున్న శక్తులను ఓడించాల్సిన అవసరం ఉందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ జన సమితి పార్టీ కార్యాలయంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెజస అధ్యక్షుడు కోదండరాం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జాతీయ గీతం ఆలపించారు. హిమాయత్ నగర్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి జాతీయ పతాకం ఆవిష్కరించారు. తెదేపా కార్యాలయంలోనూ ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details