గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెరుగుతున్న కరోనా మరణాలు.. శ్మశానవాటికలపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. శ్మశానవాటికలతోపాటు... విద్యుత్తు దహన వాటికల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. హైదరాబాద్‌లో ఈఎస్ఐ, మహాప్రస్థానం, పంజాగుట్ట, అంబర్‌పేట, బన్సీలాల్‌పేట, కవాడిగూడ, జల్‌పల్లి ఖబ్రస్థాన్‌లో మాత్రమే.. కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ అవకాశం కల్పించింది. అంబర్‌పేట, పంజాగుట్ట, బన్సీలాల్‌పేట, మహాప్రస్థానంలో విద్యుత్తు దహన వాటికలున్నాయి. పలు హిందూ శ్మశానవాటికల్లో కొవిడ్ మృతదేహాల కోసం పరిమిత సంఖ్యలో ఫ్లాట్‌పాంలను కేటాయించారు. అంతకంటే ఎక్కువ వస్తే అంత్యక్రియల నిర్వహణ కుదరదని అక్కడే తేల్చిచెబుతున్నారు. అంబర్‌పేట శ్మశాన వాటికలో 92 ఫ్లాట్‌ఫామ్‌లు ఉన్నా..... ఇందులో 17 మాత్రమే కొవిడ్ మృతదేహాల దహనానికి కేటాయించారు.
సంప్రదాయాల ప్రకారం
అప్పటికే దహనం చేసిన మృతదేహాల తాలూకు అస్థికలు, బూడిద ఉన్న కారణంగా... ఎక్కువ సంఖ్యలో దహనం చేయటంలేదు. సంప్రదాయాల ప్రకారం మూడు నుంచి ఐదు రోజులకు సంబంధీకులు వస్తున్నారు. కొందరేమో తీసుకెళ్లేందుకు రావడం లేదని.. దీంతో ఆ ఆస్థికలు, బూడిదను తామే తొలగించాల్సి వస్తుందని నిర్వహకులు వాపోతున్నారు. అంత్యక్రియల విషయంలో చాలా మందికి పట్టింపులు ఉంటాయని, వారి సంప్రదాయాలను గౌరవించాల్సి ఉంటుందని చెబుతున్నారు. విద్యుత్తు దహన వాటికల్లోనూ రోజుకు 8 నుంచి 10 మృతదేహాలను మాత్రమే దహనం చేస్తున్నారు. అంబర్‌పేటలోని దహనవాటికలో కొవిడ్ మృతదేహల అంత్యక్రియలు చాలా ఆలస్యంగా జరుగుతున్నాయి. బన్సిలాల్‌పేట, పంజాగుట్ట విద్యుత్తు దహన వాటికల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.