తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం 2020-21 ఆర్థిక ఏడాదికి రూ.2,37,632గా రాష్ట్ర అర్థ గణాంక శాఖ నిర్ధారించింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిని రూ.9,80,407 కోట్లుగా పేర్కొంది. గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర స్థూల ఉత్పత్తి- జీఎస్డీపీ, తలసరి ఆదాయం తుది గణాంకాలను కేంద్రానికి అందించింది. గత ఆర్థిక సంవత్సరానికి గాను అన్ని రాష్ట్రాల జీఎస్డీపీ, తలసరి ఆదాయం వివరాలు, గణాంకాలు, కార్యక్రమాల అమలు కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో కరోనా తీవ్ర ప్రభావం చూపిన తెలంగాణ రాష్ట్ర జీఎస్డీపీ తలసరి ఆదాయంలో వృద్ధిరేటు నమోదైంది. జీఎస్డీపీ ప్రస్తుత ధరలు వృద్ధి రేటు 2.42 శాతం కాగా... తలసరి ఆదాయంలో వృద్ధి రేటు 1.85గా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుంచి జీఎస్డీపీ, తలసరి ఆదాయంలో ప్రతి ఏటా రెండంకెల వృద్ధి రేటు ఉన్న గత ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి కరోనా తీవ్ర ప్రభావం చూపడంతో వృద్ధి రేటు గణనీయంగా తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన తలసరి ఆదాయం, జీఎస్డీపీ గణాంకాలను కేంద్రం ధ్రువీకరించి విడుదల చేసింది.
తెలంగాణలో పెరిగిన తలసరి ఆదాయం, జీఎస్‌డీపీ - Increased per capita income in Telangana, GSDP
కరోనా కష్టకాలంలోనూ తెలంగాణ రాష్ట్రంలో తలసరి ఆదాయం, జీఎస్డీపీలు రెండూ వృద్ధి నమోదు చేశాయి. తలసరి ఆదాయం రూ.2,37,632గా... జీఎస్డీపీ రూ. 9, 80,407 కోట్లుగా రాష్ట్ర అర్థగణాంక శాఖ ప్రకటించింది.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుంచి రాష్ట్ర జీఎస్డీపీ వివరాలు పరిశీలించినట్లయితే 2014-15 ఆర్థిక సంవత్సరంలో 12.02 శాతం వృద్ధి కనపరచి రూ.5,05,849 కోట్లుకు చేరింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో 14.24 శాతం వృద్ధి కనపరచి రు.5,77,902 కోట్లు చేరింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 13.92 శాతం వృద్ధి నమోదు చేసి రూ.6,58,325 కోట్లకు ఎగబాకింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 13.93 శాతం వృద్ధి కనపరిచి రూ.7,50,050 కోట్లుకు చేరింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 14.6 7శాతం వృద్ధి కనపరచి రూ.8,60, 078 కోట్లు చేరింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 11.29 శాతం వృద్ధి నమోదు చేసి 9,57,207 కోట్లకి ఎగబాకింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉండటంతో 2.42 శాతం వృద్ధితో 9,80,407 కోట్లు జీఎస్డీపీ చేరింది.
తెలంగాణలో తలసరి ఆదాయం ప్రస్తుత ధరలలో పరిశీలిస్తే... 2014-15 ఆర్థిక సంవత్సరంలో 10.65 శాతం వృద్ధి కనబరచి రూ 1,24,104గా ఉంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో 13.49 శాతం వృద్ధి కనపరచి రూ.1,40,840కి చేరింది. 2016-17 ఆర్థిక ఏడాదిలో 13.17 శాతం వృద్ధి నమోదు చేసి రూ.1,59,395కి ఎగబాకింది. 2017-18 ఆర్థిక ఏడాదిలో 12.52 శాతం వృద్ధి నమోదు చేసి 1,79,358కి చేరింది. 2018-19 ఆర్థిక ఏడాదిలో 17.40శాతం వృద్ధి కనబరచి రూ. 2,10,563కి చేరింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 10.81 శాతం వృద్ధితో రూ.2,33,325కు చేరింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 1.85 శాతం వృద్ధిని కనబరచి రూ.2,37,632లుకు తలసరి ఆదాయం చేరింది.