తెలంగాణ

telangana

ETV Bharat / city

Electricity usage : వర్షాకాలమే అయినా.. విద్యుత్​ను తెగ వాడేస్తున్నారు - కరెంట్

ఏపీలో విద్యుత్​కు డిమాండ్(Electricity usage) పెరుగుతోంది. ాగత రెండేళ్లలో జులై-సెప్టెంబరు మధ్య వినియోగం 160-170 ఎంయూల మధ్య ఉండగా..ఇప్పుడు 192 ఎంయూలకు వినియోగం పెరిగింది. ప్రస్తుతం జల విద్యుత్‌ అందుబాటులోకి రావటంతోపాటు ఏపీ జెన్‌కో థర్మల్‌, పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్ల నుంచి వచ్చే విద్యుత్తుతోనే డిమాండ్‌ సర్దుబాటు అవుతోంది.

వర్షాకాలమైనా.. విద్యుత్​ను తెగ వాడేస్తున్నారు
వర్షాకాలమైనా.. విద్యుత్​ను తెగ వాడేస్తున్నారు

By

Published : Jul 31, 2021, 8:06 AM IST

ఏపీలో విద్యుత్​కు డిమాండ్‌(Electricity usage) గత వారం రోజులుగా పెరుగుతోంది. జులైలో అన్ని ప్రాంతాల్లోనూ ఆశించిన వర్షాలు లేక గృహ విద్యుత్తు వినియోగం ఎక్కువైంది. అలాగే ఖరీఫ్‌ పనుల్లో వ్యవసాయానికి కరెంటు వాడకం పెరిగింది. ఇవన్నీ విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుదలకు కారణమని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రోజుకు సుమారు 7 మిలియన్‌ యూనిట్ల (ఎంయూ) వంతున పెరుగుతూ 192 ఎంయూలకు వినియోగం చేరింది. గత రెండేళ్లలో జులై-సెప్టెంబరు మధ్య వినియోగం 160-170 ఎంయూల మధ్య ఉంటోంది.

పెరిగిన డిమాండ్‌ సర్దుబాటు కోసం బహిరంగ మార్కెట్‌ నుంచి కనీసం 20-30 ఎంయూల విద్యుత్‌ కొనాలి. అయితే ప్రస్తుతం జల విద్యుత్‌ అందుబాటులోకి రావటంతోపాటు ఏపీ జెన్‌కో థర్మల్‌, పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్ల నుంచి వచ్చే విద్యుత్తుతోనే డిమాండ్‌ సర్దుబాటు అవుతోంది. దీంతో బహిరంగ మార్కెట్‌పై ఆధారపడాల్సిన అవసరం రాలేదు. అయితే ఏపీ జెన్‌కో థర్మల్‌ ప్లాంట్లలో రెండుమూడు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఒడిషా నుంచి కృష్ణపట్నం ఓడరేవుకు సముద్ర మార్గంలో బొగ్గు తీసుకొచ్చే ఓడల కొరత కారణంగా రవాణా ఛార్జీలు ఐదు రెట్లు పెరిగినా బొగ్గు నిర్దేశిత వ్యవధిలో రావటం లేదు.

  • ఏపీ జెన్‌కో థర్మల్‌, జల విద్యుత్‌ ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో ఉత్పత్తిలో ఉంచాలని రాష్ట్ర లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ ప్రతిపాదన పంపింది. దీంతో విజయవాడలోని వీటీపీఎస్‌లోని అయిదు యూనిట్ల ద్వారా 1,760 మెగావాట్లు, కడపలోని ఆర్‌టీపీపీ ఆరు యూనిట్ల ద్వారా 1,650 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది. రాష్ట్ర విద్యుత్‌ వినియోగంలో జెన్‌కో రోజూ 90 ఎంయూల విద్యుత్తును అందిస్తోంది.
  • ఏపీ జెన్‌కో థర్మల్‌ ప్లాంట్లలో బొగ్గు కొరత నెలకొంది. ప్రస్తుతం వీటీపీఎస్‌లో 60 వేల టన్నులు, ఆర్‌టీపీపీలో 90 వేల టన్నులు, కృష్ణపట్నంలో 40 వేల టన్నుల బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఈ నిల్వలు కేవలం రెండుమూడు రోజులకే సరిపోతాయి. సింగరేణి నుంచి నిత్యం బొగ్గు రాకుంటే జెన్‌కో యూనిట్లను బ్యాక్‌డౌన్‌ చేయాల్సిన పరిస్థితి ఉంటుందని అధికారులు తెలిపారు. ఒక్కొక్క రైలు రేక్‌ ద్వారా 3,500 మెట్రిక్‌ టన్నుల బొగ్గు వస్తుంది. ఇలా రోజుకు కనీసం 8 రేక్‌లు వస్తేనే ప్లాంట్లు నడిచే పరిస్థితి ఉంటుంది.
  • బొగ్గు కొరత కారణంగా కృష్ణపట్నంలో 800 మెగావాట్ల సామర్థ్యం గల యూనిట్‌ను మాత్రమే ఉత్పత్తిలో ఉంచారు. ఈ ప్లాంటులో వినియోగించే బొగ్గు మహానది కోల్‌ ఫీల్డ్స్‌ నుంచి సముద్ర మార్గంలో రావాలి. ఓడల కొరత కారణంగా కనీసం పది రోజులకోసారి బొగ్గు అందుతోంది.
  • ఇదీ చూడండి :Dalita Bandu: పది రోజుల్లోనే ప్రతిఫలం... దళితబంధుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు

ABOUT THE AUTHOR

...view details