attendance in schools: సర్కారు బడుల్లో పెరిగిన హాజరు.. రెండో రోజు 39 శాతం - Increased attendance in government schools
రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులకు రెండోరోజు విద్యార్థుల హాజరు స్వల్పంగా పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి రోజు 28 శాతం మంది విద్యార్థులు రాగా.. రెండో రోజు 38.82 శాతం మంది వచ్చారు.
సర్కారు బడుల్లో పెరిగిన హాజరు... రెండో రోజు 39 శాతం నమోదు
By
Published : Sep 3, 2021, 7:07 AM IST
రాష్ట్రవ్యాప్తంగా బడుల్లో గురువారం రెండో రోజు హాజరు శాతం పెరిగింది. తొలి రోజు సగటు హాజరు శాతం 22 నమోదవగా.. గురువారం 28.12కు చేరుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి రోజు 28 శాతం మంది విద్యార్థులు రాగా.. రెండో రోజు 38.82 శాతం మంది వచ్చారు. 17 జిల్లాల్లో 40 శాతం మించడం విశేషం. ప్రైవేట్ పాఠశాలల్లో రాష్ట్రవ్యాప్త సగటు హాజరు 21.74 శాతం ఉంది.
భద్రాద్రి జిల్లా గోవిందాపురం ప్రాథమిక పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయిని కరోనా బారిన పడగా.. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ ప్రాథమిక పాఠశాలలో ఓ విద్యార్థికి, ఓ సిబ్బందికి గురువారం పాజిటివ్‌గా నిర్ధారణ కావటం కలకలం రేపింది.
తెరుచుకోని 1,082 ప్రైవేట్ బడులు
రాష్ట్రవ్యాప్తంగా 10,815 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా వాటిలో 9,733 తెరుచుకున్నాయని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. 1,082 పాఠశాలలు ఇంకా ప్రారంభం కాలేదు. వాటిలో అత్యధికంగా 665 పాఠశాలలు హైదరాబాద్ జిల్లాలోనే ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలు 26,285 ఉండగా అన్నీ పునఃప్రారంభమయ్యాయి. ఎయిడెడ్ పాఠశాలల్లో 668కిగాను 603 తెరుచుకున్నాయి.
ఉపాధ్యాయురాలికి కరోనా.. పాఠశాలకు సెలవులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని గోవిందాపురం ప్రాథమిక పాఠశాలకు తొలిరోజు హాజరైన ఓ ఉపాధ్యాయిని సాయంత్రం జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడ్డారు. గురువారం పరీక్ష చేయించుకోగా.. కరోనా నిర్ధారణ అయింది. పాఠశాలలో 19 మంది విద్యార్థులుండగా బుధవారం 15 మంది హాజరయ్యారు. ఉపాధ్యాయినికి కరోనా సోకిన నేపథ్యంలో పాఠశాలకు వారం రోజులపాటు సెలవులు ప్రకటిస్తున్నట్టు ఎంఈవో వీరస్వామి తెలిపారు.
బడిలో బయటపడిన ఏడు తాచుపాములు
మూడేళ్లుగా మూతబడి ఉన్న పాఠశాలను శుభ్రం చేస్తుండగా ఏడు తాచుపాములు బయటపడ్డాయి. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు గ్రామంలోని తుంగావారి కాలనీ ప్రాథమిక పాఠశాలను విద్యార్థులు లేరని 2018లో తాత్కాలికంగా మూసివేశారు. ఇక్కడున్న కొద్దిమంది పిల్లలను గ్రామంలోని వేరే బడికి పంపుతున్నారు. ఇక్కడ ఓ ఉపాధ్యాయ పోస్టు కూడా ఉంది. ప్రస్తుతం విద్యాసంస్థలు పునఃప్రారంభం కావటంతో ఈ పాఠశాలను తెరవాలని విద్యాధికారులను కాలనీవాసులు కోరారు. గురువారం పంచాయతీ సిబ్బంది భవనాలను శుభ్రం చేస్తుండగా పాములు బయటపడ్డాయి. వాటిని వారు వెంటనే చంపేశారు.