తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రొఫెసర్ల గదులు కొవిడ్​ వార్డులుగా మార్పు - జీజీహెచ్​లో కొవిడ్​ రోగులకు పడకలు

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జీజీహెచ్​లో కరోనాతో చికిత్స కోసం వచ్చే రోగుల తాకిడి పెరిగింది. ప్రొఫెసర్ల గదులను ఖాళీ చేయించి వాటిల్లో పడకలు ఏర్పాటు చేసి కొవిడ్​ బాధితులకు ఏర్పాటు చేయనున్నారు. అవసరమైతే నాన్​కొవిడ్​ వార్డులను కూడా కొవిడ్​ చికిత్సకే కేటాయించేలా యోచిస్తున్నారు.

covid wards guntur news, ap corona news today
ప్రొఫెసర్ల గదులు కొవిడ్​ వార్డులుగా మార్పు

By

Published : Apr 19, 2021, 10:51 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలకు (జీజీహెచ్‌) కరోనా వైద్యసేవల కోసం వస్తున్న రోగులు రోజురోజుకూ పెరుగుతున్నారు. వారికి పడకలు కేటాయించలేని పరిస్థితి నెలకొంది. వైద్యం కోసం వచ్చిన ఏ రోగినీ కాదనకుండా చేర్చుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ గత రెండు రోజులుగా తమకు జీజీహెచ్‌లో ప్రవేశం దొరకలేదని, బెడ్లు ఖాళీ లేవంటున్నారని బాధితుల ఆవేదనపై మీడియాలో వస్తున్న కథనాలకు ఆసుపత్రి, జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. ఆదివారం ఉదయాన్నే ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిపై సమీక్షించారు.

ఆక్సిజన్‌ సరఫరాకు ఇబ్బంది

జిల్లా కొవిడ్‌ ప్రత్యేకాధికారి, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి వి.ఉషారాణి సైతం జీజీహెచ్‌ను సందర్శించి, రోగులతో మాట్లాడారు. పరీక్షలు చేయించుకోవడానికి, ఆసుపత్రిలో చేరటానికి వచ్చినవారితో క్యాజువాల్టీ ఓపీ వద్ద రద్దీ ఏర్పడింది. దీంతో ఆసుపత్రికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ప్రవేశం కల్పించాలంటే నాన్‌ కొవిడ్‌ వార్డులను ఖాళీ చేయించి, అక్కడి పడకలనూ కొవిడ్‌ చికిత్సకే కేటాయించాలనే యోచనకు వచ్చారు. తొలుత బెడ్‌కు ఇద్దరి చొప్పున ఉంచాలనుకున్నా.. ఆక్సిజన్‌ సరఫరాకు ఇబ్బంది అవుతుందని ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆసుపత్రిలో 600 పడకల్లో 570 మంది ఉన్నారు. రోగుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని ప్రొఫెసర్ల గదులను ఖాళీ చేయించి వాటిల్లోనూ పడకలు ఏర్పాటుచేసి ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఇంకా కొందరు కొవిడ్‌ రోగులు నిరీక్షిస్తూనే ఉండటంతో అవసరమైతే నాన్‌ కొవిడ్‌ వార్డులను ఖాళీ చేయించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు.

పీజీలపై విధుల భారం

ఆస్పత్రిలో కరోనా వైద్యసేవలు అందించడంలో పీజీ వైద్యులు ముందుంటున్నారు. దీంతో గతవారం రోజుల్లో జనరల్‌ మెడిసిన్‌, మత్తు విభాగాలకు చెందిన 8 మంది పీజీలు కరోనా బారిన పడ్డారు. వీరితో పాటు ముగ్గురు సహాయ ఆచార్యులకూ వ్యాధి నిర్ధారణ అయింది. వీరితో కలిసి పనిచేసిన వారికి వ్యాధి నిర్ధారణ పరీక్షలకు ఏర్పాట్లు చేయకపోవడంతో.. వారు బయట ల్యాబ్‌లలో పరీక్ష చేయించుకుంటున్నారు. 2015 బ్యాచ్‌ హౌస్‌సర్జన్లు 225 మంది ఇటీవలే కోర్సు పూర్తిచేసుకుని బయటకు వెళ్లిపోయారు. దీంతో పీజీలపై పని ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది. కొత్త హౌస్‌సర్జన్లు వచ్చేవరకూ తమకు విధుల భారం తప్పేలా లేదని పీజీ వైద్యుడొకరు తెలిపారు.

ఈ విషయంపై.. ఆసుపత్రి పర్యవేక్షకురాలు ఆచార్య ప్రభావతిని ‘ఈనాడు’ వివరణ కోరగా రోగుల రద్దీ దృష్ట్యా నాన్‌ కొవిడ్‌ వార్డులను దశలవారీగా ఖాళీచేయించి కరోనా రోగులకు కేటాయిస్తామన్నారు. నాన్‌కొవిడ్‌లో అత్యవసరమైన శస్త్రచికిత్సలు మాత్రమే నిర్వహిస్తామని ఆమె స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:మూడో దశ ముప్పు.. ముందే గుర్తించొచ్చంటోన్న శాస్త్రవేత్తలు

ABOUT THE AUTHOR

...view details