తెలంగాణ

telangana

ETV Bharat / city

తెలంగాణలో 4 డేంజర్​ జోన్లు..అవి ఏంటో తెలుసా..! - four zones of hyderabad contain corona cases

ప్రస్తుతం హైదరాబాద్‌లోని నాలుగు జోన్లలో తప్ప, రాష్ట్రంలో ఎక్కడా కరోనా చికిత్స పొందుతున్న వారి (యాక్టివ్‌) కేసులు లేవని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కరోనాపై అధికారులతో ప్రగతి భవన్​లో సమీక్ష నిర్వహించారు.

in telangana state only four zones of Hyderabad contains corona cases
తెలంగాణలో ఆ 4 జోన్లలోనే కరోనా

By

Published : May 16, 2020, 5:41 AM IST

Updated : May 16, 2020, 6:06 AM IST

తెలంగాణలో ప్రస్తుతం అమలవుతున్న లాక్‌డౌన్‌, రాత్రిపూట కర్ఫ్యూ యథావిధిగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 17తో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ముగుస్తున్నందున కేంద్ర ప్రభుత్వమిచ్చే మార్గదర్శకాలను పరిశీలించి, రాష్ట్రంలో అనుసరించే వ్యూహం ఖరారు చేస్తామని తెలిపారు. ఈ వైరస్‌ ఎంతకాలం ఉంటుందో కూడా తెలియదు కాబట్టి అందుకనుగుణంగా వ్యూహం అనుసరించక తప్పదని చెప్పారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లోని నాలుగు జోన్లలో తప్ప, రాష్ట్రంలో ఎక్కడా కరోనా చికిత్స పొందుతున్న వారి (యాక్టివ్‌) కేసులు లేవని కేసీఆర్ తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు కొనసాగిస్తూనే, వానాకాలంలో వచ్చే సీజనల్‌ వ్యాధులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రగతిభవన్‌లో శుక్రవారం సీఎం కరోనాపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

‘తెలంగాణలో హైదరాబాద్‌ పరిధిలోని ఎల్‌.బి.నగర్‌, మలక్‌పేట, చార్మినార్‌, కార్వాన్‌ జోన్లలోనే ప్రస్తుతం కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. ఈ జోన్లలో 1,442 కుటుంబాల్లోనే వైరస్‌ ఉంది. యాదాద్రిభువనగిరి, జనగామ, మంచిర్యాల జిల్లాలకు చెందిన కొందరు వలస కూలీలకు వైరస్‌ సోకినట్లు తేలింది తప్ప, ఆ జిల్లా వాసులెవరికీ పాజిటివ్‌ లేదు. వారు కూడా హైదరాబాద్‌లోనే చికిత్స పొందుతున్నారు. పాజిటివ్‌ కేసులున్న నాలుగు కంటెయిన్‌మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నాం.
సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా పట్టణాలు, గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలి. నెలకు ఐదుసార్లు సోడియం హైపోక్లోరైట్‌ పిచికారీ చేయాలి. మే నెల చివరి నాటికి రెండు సార్లు, జూన్‌లో ఐదుసార్లు పిచికారీ చేయాలి. పట్టణాల్లో మేయర్లు, చైర్‌పర్సన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచి, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులు, జడ్పీ చైర్‌పర్సన్లు క్రియాశీలకంగా వ్యవహరించాలి. మంత్రులు కేటీఆర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావులు వారికి తగిన సూచనలివ్వాలి. రాష్ట్ర వ్యాప్తంగా జూన్‌ 20 నుంచి తెలంగాణకు హరితహారం నిర్వహించాలి.‘

గ్రామాలు, పట్టణాలు, నగరాలకు నిధులు

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా గ్రామాలు, పట్టణాలు, నగరాలలో పారిశుద్ధ్య, ఇతర అత్యవసర పనులు చేయడానికి నిధుల కొరత లేకుండా చేస్తున్నాం. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌, మే నెలలకు సంబంధించిన నిధులను ఇప్పటికే ఇచ్చాం. జూన్‌కు సంబంధించిన నిధులను కూడా విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించాం’ అని సీఎం చెప్పారు.

బస్తీ దవాఖానాలను పెంచాలి

హైదరాబాద్‌లో బస్తీదవాఖానాలను వెంటనే పెంచాలని సీఎం ఆదేశించారు. నగరంలో వీటికి మంచి స్పందన వచ్చిందని, ప్రస్తుతం 123 నడుస్తుండగా మరో 45 దవాఖానాలు వెంటనే ప్రారంభించాలని మంత్రులు ఈటల రాజేెందర్‌, కేటీఆర్‌ను ఆదేశించారు. సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రత్యేక ప్రధానకార్యదర్శి శాంతికుమారి, పురపాలక ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, కమిషనర్‌ సత్యనారాయణ, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ సుల్తానియా, కమిషనర్‌ రఘునందన్‌రావు, పోలీస్‌ కమిషనర్లు అంజనీకుమార్‌, సజ్జనార్‌, మహేశ్‌భగవత్‌, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి జితేందర్‌ పాల్గొన్నారు.

ఏసీల దుకాణాలు, ఆటోమొబైల్‌ షోరూంలు, విడిభాగాల షాపులకు అనుమతి

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో శనివారం నుంచి ఏసీ అమ్మకాలు జరిపే షాపులు, ఆటోమొబైల్‌ షో రూంలు, స్పేర్‌పార్ట్స్‌ షాపులు తెరుచుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్‌, ఆర్టీఏ కార్యాలయాలు నడుస్తాయి. మిగతా లాక్‌డౌన్‌ నిబంధనలు యథావిధిగా అమలవుతాయి. విదేశాలు, రైళ్ల ద్వారా రాష్ట్రానికి వచ్చే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. హైదరాబాద్‌లో దిగే ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని విమానాశ్రయం నుంచే నేరుగా ప్రత్యేక బస్సుల ద్వారా వారి సొంత రాష్ట్రాలకు పంపించాలి. వలస కార్మికులకు పరీక్షలు నిర్వహించాలి. ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని సొంత రాష్ట్రాలకు పంపించాలి.

Last Updated : May 16, 2020, 6:06 AM IST

ABOUT THE AUTHOR

...view details