తెలంగాణ

telangana

ETV Bharat / city

పిల్లలకు పాల చుక్కలేదు.. పెద్దలకు తిండి లేదు - వరద కష్టాలు

వరద బాధితులు ఆకలితో అల్లాడుతున్నారు. సరిపడా అన్నం లేదు.. పిల్లలకు పాలు లేవు.. నిత్యావసరాలూ సరిగా అందడం లేదు.. ఏపీలోని కోనసీమలో వరద బాధితుల ఆవేదన అంతా ఇంతా కాదు.

konaseema
konaseema

By

Published : Jul 18, 2022, 8:12 AM IST

వరద బాధితులు ఆకలితో అల్లాడుతున్నారు. సరిపడా అన్నం లేదు.. పిల్లలకు పాలు లేవు.. నిత్యావసరాలూ సరిగా అందడం లేదు.. ఆంధ్రప్రదేశ్​లోని కోనసీమలో వరద బాధితుల ఆవేదన అంతా ఇంతా కాదు. కొంతమంది ఏటిగట్లపైనే గుడారాలు వేసుకుని ఉంటున్నారు. వరదలొచ్చి అయిదు రోజులవుతున్నా.. శనివారం నుంచే భోజనాల సరఫరా ప్రారంభించారని చెబుతున్నారు. పాత బకాయిలు చెల్లించకపోవడంతో పడవలు నడవడం లేదు. పలుచోట్ల భోజనం సరఫరా అంతంతమాత్రంగానే ఉంది.

పునరావాస కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేశారో కూడా తెలియదని కొందరు బాధితులు పేర్కొన్నారు. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని పెదలంకను వరద ముంచెత్తడంతో కొందరు రెండురోజులుగా ఇళ్లపైనే ఉంటున్నారు. వారికి భోజనం అంతంతమాత్రంగానే అందుతోంది. ‘అయిదు రోజులుగా వరదలోనే ఉన్నాం.. భోజనం అడిగితే.. ఇళ్లు పూర్తిగా మునగలేదు కదా? వీటిపై మాకు ఉత్తర్వులు రాలేదు’ అన్నారు. పడవలు కూడా సరిపడా ఏర్పాటుచేయడం లేదు’ అని తాటిపాకమఠానికి చెందిన ప్రశాంతి పేర్కొన్నారు.

ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తమవాళ్లే చిన్నచిన్న ఏర్పాట్లు చేసి బయటకు తీసుకువస్తున్నారని వివరించారు. పిల్లలకు పాలు దొరకని దుస్థితి నెలకొందని పి.గన్నవరం మండలంలోని లంకలవాసులు పేర్కొన్నారు. వరద బాధిత ప్రాంతాల్లో శనివారం నాటికి 9,000 మందిని సహాయ శిబిరాలకు తరలించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. వారికి ఇచ్చిన భోజనం ప్యాకెట్లు 7,500 మాత్రమే. పాలప్యాకెట్లు కూడా సుమారు 2,000 అందించినట్లు చెబుతున్నా.. అధికశాతం కుటుంబాలకు చేరనే లేదు. ‘నీళ్లు, పాలు లేక చంటిపిల్లలతో అల్లాడిపోతున్నామని కోనసీమ జిల్లా పి.గన్నవరంలో బాధిత కుటుంబాలు మంత్రి విశ్వరూప్‌ ముందు అసంతృప్తి వ్యక్తం చేయడం ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. మంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. ఆదివారం మధ్యాహ్నం నుంచి వారికి సహాయం భారీగా మొదలైంది.

పడవకు రూ. 4,000 ఖర్చు:వరద సమయంలో పడవలే కీలకం. ప్రస్తుతం చాలా ముంపు గ్రామాలకు ఇవి అందుబాటులో లేవు. బాధితులు అడుగుతుంటే ఒకటి, రెండు మాత్రమే పంపిస్తున్నారు. 2020 నాటి వరదల సమయంలో పడవలు, ఆహారం, మంచినీరు తదితర ఏర్పాట్లకు సంబంధించిన బకాయిలను ప్రభుత్వం ఇప్పటికీ చెల్లించలేదు. అందుకే పడవలు రావడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు.

ఒక్కో పడవకు రోజుకు రూ. 4,000 ఇవ్వాల్సి ఉంటుంది. ప్రవాహం ఉద్ధృతంగా ఉన్నందున పడవ నడపాలంటే అనుభవం ఉన్నవారు ముగ్గురైనా ఉండాలి. డీజిల్‌ కింద రూ.వెయ్యి అవుతుంది. ఇవన్నీ మేం సొంతంగా పెట్టుకోవాలా? అని వారు ప్రశ్నిస్తున్నారు. కొన్నిచోట్ల సర్పంచులు, ప్రజాప్రతినిధులు చొరవచూపి పడవలు తెప్పిస్తున్నారు.

ఏటిగట్లపైనే జీవనం.. అర్ధాకలితోనే:రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో సహాయ శిబిరం ఏర్పాటు చేస్తే.. ఇల్లు, సామగ్రి, పశువుల్ని వదిలేసి అక్కడికి ఎలా వెళ్లగలం అనే ప్రశ్న రాజోలు, పి.గన్నవరం తదితర మండలాల్లోని పలు కుటుంబాల వారు ప్రశ్నిస్తున్నారు. ఇళ్లు మునిగిపోవడంతో ఏటిగట్టునే గుడారాలు వేసుకున్నారు. మరికొందరు ఇళ్లపైనే ఉంటున్నారు. ఇంటింటికి 25 కిలోల బియ్యం, కందిపప్పు, పామోలిన్‌, పాల ప్యాకెట్‌, ఉల్లిగడ్డలు, బంగాళదుంప వంటివి తమకు అందలేదని చాలామంది పేర్కొంటున్నారు. కొన్నిచోట్ల రేషన్‌ దుకాణానికి వెళ్లి తెచ్చుకోమంటున్నారని వివరించారు.

నాలుగు కుటుంబాల్లో 15 మంది ఉన్నాం.. అయిదు ప్యాకెట్ల భోజనం ఇచ్చారు. అదే పంచుకుని తింటున్నాం. పిల్లకు పాలయినా లేవు. భోజనాలు కూడా ఈరోజే పెట్టారు. రెండు మూడు ప్యాకెట్లు పంచి.. సరిపోలేదంటూ వెళ్లిపోయి, మళ్లీ తెస్తున్నారు.. శనివారం రాత్రి 1 గంటకు ఇచ్చారు.. గతంలో అయితే పిల్లలకు పాలు, బిస్కెట్‌ ప్యాకెట్లు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి భోజనం ప్యాకెట్లు ఇచ్చే వారు.

- కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం నాగుల్లంక గ్రామ పరిధిలోని కాట్రగడ్డకు చెందిన విక్టోరియా ఆవేదన ఇది.

ముంపులో లేదన్నారు.. అయినా మునిగింది..

‘మా ఊరు ముంపులో చిక్కుకోదన్నారు. పోలవరం వల్ల ఇబ్బంది ఉండదని అధికారులు చెప్పారు. మేం చాలా భరోసాతో ఉన్నాం. ఇంతలో వరద ముంచెత్తి, ఇళ్లన్నీ మునిగిపోయాయి. కట్టుబట్టలతో పరుగుపరుగున రావాల్సి వచ్చింది’ అని వేలేరుపాడు మండలం ఎర్రబోరు గ్రామవాసులు గోల పెడుతున్నారు. బండ్లబోరు వద్ద బాధితులు స్వయంగా ఏర్పాటుచేసుకున్న పునరావాస శిబిరంలో ఒక ఆశా కార్యకర్త భోరున ఏడుస్తూ కనిపించారు. ఆమె పేరు కారం సుమలత. తాను డ్యూటీకి వెళ్లిపోయానని, ఇంతలో ముంపు వచ్చి అంతా మునిగిపోయిందని ఆమె వాపోయారు. ఎర్రబోరులో దాదాపు 53 కుటుంబాలది ఇదే వ్యథ.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details