సికింద్రాబాద్ గన్‌రాక్ ఎన్‌క్లేవ్ కాలనీలోని తన ఇంటిని నందనవనంగా తీర్చిదిద్దారు నీతా ప్రసాద్. పర్యావరణం, ప్రకృతి.. మొక్కలు, పూలు అంటే నీతాకు పంచ ప్రాణాలు. అదే అలవాటుగా మార్చుకుని 2015 నుంచి ఇంట్లోనే మొక్కల పెంపకం మొదలు పెట్టారు. వెళ్లిన ప్రతి చోట కొత్తగా కనిపించే పూలు, పండ్ల మొక్కలు తెచ్చి నాటడం వ్యాపకంగా పెట్టుకున్నారు. ఆరోగ్యం పట్ల స్పృహ కలిగిన నీతా.. రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులతో పండించిన పంటలకు దూరంగా ఉంటున్నారు. ఇంటి అవసరాలకు సరిపడా కూరగాయలు, ఆకుకూరలు సొంతంగా పండిస్తున్నారు. మూడంతస్తుల భవనంలో మూడు లేయర్లలో 18 వందలకు పైగా చదరపు మీటర్ల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు.
నీతా ప్రసాద్ ఇంటి ఆవరణలో ఎటు చూసిన పచ్చదనమే కనిపిస్తుంది. గులాబీ, బంతి, చేమంతి వంటి పూల మొక్కలు వేలాడుతూ స్వాగతం పలుకుతుంటాయి. టమాట, బెండ, బీర, సోర, కాకర వంటి అన్ని రకాల కూరగాయలతోపాటు ప్రత్యేకించి మామిడి, సపోటా, అంజీర్, జామ, దానిమ్మ, బత్తాయి, నారింజ, డ్రాగన్ ఫ్రూట్ తదితర పండ్లు పండిస్తున్నారు. ఎర్రమట్టి, వర్మీ కంపోస్ట్, జీవామృతం ఉపయోగిస్తూ చీడపీడలు, తెగుళ్లు సోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.