తొలుత విదేశీ...ఆ తర్వాత దిల్లీ మూలాలు...ఇప్పుడు కొత్తగా ‘కోయంబేడు’ ఏపీలో కొవిడ్ విస్తృత వ్యాప్తికి కారణమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో నిన్న 33 మంది కరోనా బారిన పడ్డారని ప్రభుత్వం ప్రకటించగా.. ఇందులో 20 మందికి తమిళనాడులోని కోయంబేడు మార్కెట్‌కు వెళ్లడం వల్లే సోకిందని స్పష్టం చేసింది. తూర్పుగోదావరి జిల్లాలో కొత్తగా నమోదైన కేసు ఈ మార్కెట్ వల్ల వచ్చిందే అని ప్రకటించడం విశేషం. చిత్తూరు జిల్లాలో 10మందికి, నెల్లూరు జిల్లాలో 9 మందికి ఆ వ్యాపార కేంద్రంతో సంబంధం కారణంగానే సోకింది.
ఇప్పటివరకు ఏపీలో మొత్తం కరోనా కేసులు 2,051కి చేరాయి. ఎనిమిది జిల్లాల్లో కొత్తగా ఎవరికి వైరస్ సోకలేదు. మిగిలిన అయిదు జిల్లాల్లో కొత్త కేసులు రాగా..అందులో మూడు జిల్లాల్లో కొవిడ్ విస్తరణకు కోయంబేడు కారణమయింది. కర్నూలులో మరో 9మందికి సోకడంతో.. ఈ జిల్లాలో మొత్తం కేసులు 600సంఖ్య దిశగా సాగుతున్నాయి. కృష్ణా జిల్లాలో మరో నలుగురు కొవిడ్ బారినపడ్డారు. గడిచిన 24 గంటల్లో 10,730 మంది శాంపిళ్లు పరీక్షించినట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కృష్ణా జిల్లాలో ఒకరు మరణించగా.. మృతుల సంఖ్య 46కు పెరిగింది.