తెలంగాణ

telangana

ETV Bharat / city

పరిశ్రమలపై కరోనాతో పాటు లాక్​డౌన్​ ప్రభావం.. తగ్గిన ఉత్పత్తి - మూడో వంతు కార్మికులే పనిలోకి

రాములు.. గాంధీనగర్‌ పారిశ్రామికవాడలో కార్మికుడు. గత నెల రోజులుగా కరోనా భయంతో పనికి వెళ్లడం లేదు. లాక్‌డౌన్‌ తర్వాత పరిశ్రమే మూతపడడంతో ఇంటివద్దే ఉంటున్నాడు. పొట్టపోసుకోవడం కష్టంగా మారిందని వాపోతున్నాడు. దామోదర్‌.. చర్లపల్లిలో పారిశ్రామికవేత్త. కరోనా సమయంలో ప్లాస్టిక్‌ పరిశ్రమను పూర్తిస్థాయిలో నడిపించాడు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా... కరోనా సోకింది. దీంతో పరిశ్రమ మూతపడింది. మళ్లీ పరిశ్రమ తెరిచినా వెంటనే లాక్‌డౌన్‌ రావడంతో నడపలేని పరిస్థితి ఏర్పడింది.

Impact of lockdown along with corona on industries and reduced output
Impact of lockdown along with corona on industries and reduced output

By

Published : May 25, 2021, 8:00 AM IST

కరోనా తీవ్రత, లాక్‌డౌన్‌లతో ఏర్పడిన పరిస్థితులు తెలంగాణ పారిశ్రామిక రంగాన్ని దెబ్బతీస్తున్నాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మనుగడపై తీవ్ర ప్రభావం పడింది. కరోనా వ్యాధి భయానికి తోడు లాక్‌డౌన్‌ వల్ల పనిలోకి వచ్చే కార్మికుల సంఖ్య మూడో వంతుకు పడిపోయింది. ఇతర రాష్ట్రాల కార్మికులు పలువురు ఇంటి బాట పట్టారు. స్థానిక కార్మికులు కొందరు మాత్రమే విధులకు హాజరవుతున్నారు. దీంతో ఉత్పత్తి గణనీయంగా తగ్గుతోంది. ఆర్డర్లు నిలిచిపోయాయి. రవాణా స్తంభించిపోయింది.

రెండోదశతో కష్టాలు

గత జులైలో లాక్‌డౌన్‌ ఎత్తివేశాక తిరిగి పరిశ్రమలు కళకళలాడాయి. ఉత్పత్తి గరిష్ఠస్థాయిలో జరిగింది, కానీ గత నెల నుంచి మళ్లీ కరోనా రెండో దశ ప్రారంభం కావడం, గత వారం లాక్‌డౌన్‌ విధించడంతో పరిస్థితి మొదటికి వచ్చింది. ప్రభుత్వం పారిశ్రామికవాడల్లోని ఉత్పాదక సంస్థలకు పూర్తిస్థాయి మినహాయింపునిచ్చింది.. మిగిలినవి ఉదయం 6 నుంచి పది గంటల వరకే పనిచేయాలని నిబంధనలు విధించింది. ప్రస్తుతం ఔషధ, వైద్యపరికరాలు, మాస్క్‌లు, ఫేస్‌షీల్డ్‌ల పరిశ్రమలు పూర్తిసామర్థ్యంతో నడుస్తున్నాయి. వాటిల్లో పనిచేసే కార్మికుల్లో సగం మంది మాత్రమే విధులకు హాజరవుతున్నారు. పారిశ్రామికవాడల బయట పనిచేసే పరిశ్రమలు పది గంటల తర్వాత మూతపడుతున్నాయి. ఉదయం వేళల్లో కార్మికులు పనులకు రాక కొన్నిటిని మొత్తానికి మూసివేస్తుంటే... నాలుగు గంటలకే పూర్తివేతనం ఇవ్వడం వల్ల నష్టపోతామని కొందరు యజమానులు వాటిని తెరవడం లేదు.

అన్నిరకాలుగా నష్టం

పరిశ్రమలు పూర్తిస్థాయిలో పనిచేయకపోవడం వల్ల ఉత్పత్తులు తగ్గాయి. గత నాలుగు రోజుల్లో పది శాతానికి పైగా ఉత్పత్తి పడిపోయింది. మరోవైపు లాక్‌డౌన్‌తో ముడిసరకుల రవాణా వాహనాలు నిలిచిపోయాయి. ఉత్పత్తులు మా·ర్కెట్‌లోకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. పాలిమర్స్‌, స్టీలు, ఇనుము తదితర సామగ్రి ధరలు పెరిగాయి. పారిశ్రామిక ఆక్సిజన్‌ కొరత వల్ల తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. ఆశించిన మేరకు ఆర్డర్లు రాకపోవడం, బిల్లుల చెల్లింపులు నిలిచిపోవడంతో పారిశ్రామికవేత్తలు ఆర్థికంగా కుదేలవుతున్నారు. అద్దెభవనాల్లో, షెడ్లలో చిన్న పరిశ్రమలు నడుపుతున్న వారు అద్దెలు, కరెంటు బిల్లులు, బ్యాంకు కిస్తీలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. సూక్ష్మపరిశ్రమల వారి పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. కష్టాల్లో ఉన్న బ్యాంకులు రుణవసూళ్లను అపడం లేదని చర్లపల్లి పారిశ్రామికవేత్త దామోదరాచారి ఆవేదన వ్యక్తంచేశారు.కేంద్రం గత ఏడాది ప్రకటించిన ఆత్మనిర్భర్‌ ప్యాకేజీలో తమకేమీ సాయం లభించలేదని అన్నారు.

కళ తప్పాయిలా!

రాష్ట్రంలో 156 పారిశ్రామికవాడలున్నాయి. వీటిల్లో 62 వేల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలుండగా... 12 లక్షల మందికిపైగా కార్మికులు పనిచేసేవారు. వారి సంఖ్య ఇప్పుడు ఆరు లక్షలకు తగ్గింది. హైదరాబాద్‌, రంగారెడ్డి, వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాల పరిధిలో పారిశ్రామికవాడలు కళ తప్పాయి. భారీ పరిశ్రమల్లో అయితే 50 మందికి గాను 15 నుంచి 20 మంది, చిన్న పరిశ్రమల్లో 3 నుంచి ఆరుగురు మాత్రమే ఉన్నారు.

నామమాత్రంగా నడుస్తున్నాయి

కరోనా, లాక్‌డౌన్‌ పరిణామాల వల్ల అధికశాతం పరిశ్రమలు నామమాత్రంగా నడుస్తున్నాయి. మూతపడొద్దనే ఉద్దేశంతో చాలా తెరిచి ఉంచారు. ఉత్పత్తులకు డిమాండ్‌ తగ్గింది. కార్మికులు చాలా మంది భయంతో ఉండి పనులకు రావడం లేదు. -సుధీర్‌రెడ్డి, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య అధ్యక్షుడు

మహిళా పారిశ్రామికవేత్తలను ఆదుకోవాలి

కరోనా నష్టాల నుంచి మహిళా పారిశ్రామికవేత్తలు కోలుకోవడం లేదు. పరిశ్రమలు బాగా దెబ్బతిన్నాయి. కనీస ఆదాయం లేదు. ఉపాధి తగ్గింది. ఖాయిలా పరిశ్రమలను ప్రభుత్వాలే ఆదుకోవాలి. మహిళలను ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలి.

- డీవీవీ శ్రీలక్ష్మివాణి, రాష్ట్ర సూక్ష్మ,చిన్న, మధ్యతరహా మహిళాపారిశ్రామికవేత్తల సంఘం అధ్యక్షురాలు

ఇవీ చూడండి:సాగునీటి పథకాల పనుల పురోగతిపై నేడు ఉన్నతస్థాయి సమావేశం

ABOUT THE AUTHOR

...view details