ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఇమ్మిగ్రేషన్ ఫోరం ఏర్పాటు చేసి సేవలను విస్తృతం చేయాలని యోచిస్తున్నట్లు తానా నూతన అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ‘రైతు కోసం’ సేవల్ని మరింత విస్తరిస్తాం, అంతర్జాతీయంగా తెలుగు సంఘాల భాగస్వామ్యంతో వచ్చే ఏడాది కూడా ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవాన్ని నిర్వహిస్తామని తెలిపారు. టెలిమెడిసిన్ ద్వారా భారతదేశంలోని తెలుగు వారికి వైద్య సేవలు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు.
ఏపీలోని కృష్ణా జిల్లా పెదఅవుటపల్లికి చెందిన అంజయ్య చౌదరి 2011 నుంచి తానాలో వివిధ పదవులతో పాటు రెండు దఫాలుగా తానా టీం స్వ్కేర్(తానా విపత్కర విభాగ సేవా సంస్థ) ఛైర్మన్‌గా పనిచేశారు. ఇటీవలే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన అమెరికా నుంచి ‘ఈనాడు-ఈటీవీ’తో మాట్లాడారు. అమెరికాలో తెలుగు కుటుంబాల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో తానా తరఫున వారికి సహాయసహకారాలు అందేలా సేవలు విస్తరించనున్నామని చెప్పారు.
వీసాల విషయంలో ఇబ్బందుల్లేకుండా
‘‘భారత్ నుంచి వచ్చేప్పుడు, అమెరికా నుంచి వెళ్లేప్పుడు వీసాల గడువు తీరి ఇబ్బంది పడుతుంటారు. మరోవైపు ఇమ్మిగ్రేషన్‌లో మార్పులు జరుగుతుంటాయి. అత్యవసరంగా పరిష్కరించాల్సిన ఇలాంటి అంశాలకు సంబంధించి తానా ఇమ్మిగ్రేషన్ ఫోరం ఏర్పాటు చేయబోతున్నాం. దీని ద్వారా అవసరమైన సలహాలు అందిస్తాం. తానా మెడికల్ ఫోరం ద్వారా అత్యవసర సమయాల్లో వైద్య సలహాలు అందించేలా చూస్తాం. భారత్ నుంచి వచ్చే వారికి అవసరమయ్యే వైద్య సేవలను ఈ విభాగం అందిస్తుంది. అమెరికాలోనే పుట్టి పెరిగిన పిల్లలకు.. ఎస్‌ఏటీ, ఏసీటీ కోర్సుల్లో శిక్షణ, కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి సెమినార్లు నిర్వహిస్తాం.
‘తెలుగు భాష’ సేవలో తానా
తానా ఆధ్వర్యంలో భాషా సంస్కృతికి పెద్దపీట వేస్తున్నాం. తెలుగు నవలలు, రచనల పోటీలు నిర్వహించడం ద్వారా భాషాభివృద్ధికి చేయూత అందిస్తున్నాం. కొవిడ్ సమయంలో 100 తెలుగు సంఘాల భాగస్వామ్యంతో 50 దేశాల్లోని తెలుగు వారందరినీ ఒకే వేదిక మీదకు తెచ్చి ప్రపంచ సాంస్కృతిక మహోత్సవం నిర్వహించాం. దీనికి అధిక స్పందన లభించింది. 2022లో మరోసారి ఈ సాంస్కృతిక మహోత్సవం చేయబోతున్నాం. ‘‘ఎల్లలు లేని తెలుగు.. ఎప్పటికీ వెలుగు’’ అనే కార్యక్రమం ద్వారా తమిళనాడు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారికి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రతి రెండేళ్లకు జరిగే తానా మహాసభలకు తెలుగు రాష్ట్రాల నుంచి కవులు, కళాకారుల్ని ఆహ్వానిస్తున్నాం. మరుగున పడిపోతున్న కళలను వెలికితీసి వారికి ప్రోత్సాహం అందిస్తున్నాం. తానా చైతన్య స్రవంతి ద్వారా జానపద కళోత్సవాల ద్వారా కవులు, కళాకారుల్ని సత్కరిస్తున్నాం. తానా ప్రపంచ సాహిత్య వేదిక ద్వారా ప్రతి నెలాఖరు ఆదివారం నిర్వహించే కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తోంది. అమెరికాలోని చిన్నారులు సులభంగా తెలుగు మాట్లాడటం, రాయడం కోసం రెండేళ్లుగా ‘తానా పాఠశాల’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇందులో భాగంగా తెలుగు పలుకు, అడుగు, పరుగు, వెలుగు అనే అంశాలపై ప్రభుత్వ సహకారంతో తరగతులు నిర్వహిస్తున్నాం. గతేడాది 1,500 మంది చిన్నారులకు తెలుగు నేర్పించాం. రాబోయే రెండేళ్లలో 5 వేల మందికి తెలుగు నేర్పించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం.
కొవిడ్‌లో కీలకంగా
కొవిడ్ సమయంలో తెలుగు రాష్ట్రాలకు 700 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, 20వేల మెడికల్ కిట్లు అందించాం. వేలాదిమంది వలస కార్మికులకు అన్నదాన కార్యక్రమాలు చేపట్టాం. తానా ఫౌండేషన్ ద్వారా 45 ఏళ్లుగా 220 మిలియన్ డాలర్లతో సేవా కార్యక్రమాలు నిర్వహించాం. తెలుగు రాష్ట్రాల్లో శంకర నేత్రాలయతో కలిసి 1,000 పైగా నేత్ర వైద్య శిబిరాల ద్వారా 40వేల మందికి పైగా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్లజోళ్లు అందించాం. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి భాగస్వామ్యంతో శిబిరాలు నిర్వహించాం. ఆపరేషన్ వారధి కింద వెయ్యి మంది అనాథ బాలబాలికలకు ఏడాదికి సరిపడా కార్పస్‌ఫండ్, పలు చోట్ల మినరల్ వాటర్ ప్లాంట్లు, వేలాదిగా డిజిటల్ తరగతులు, డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేశాం. గ్రామీణ ప్రాంతాల్లో గ్రహణమొర్రి, మణిపాల్ ఆసుపత్రి భాగస్వామ్యంతో గుండె సంబంధిత పరీక్షలు చేస్తున్నాం. పురిటిగడ్డను మరచిపోకుండా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం.