బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తూర్పు మధ్య బంగాళాఖాతానికి అనుకొని ఉత్తర అండమాన్ ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ ఉదయం తీవ్ర అల్పపీడనంగా మారిందని పేర్కొంది. అది తూర్పు మధ్య బంగాళాఖాతానికి ఆనుకొని ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉందని వివరించింది.
మరో మూడు రోజుల పాటు వర్షాలు - హైదరాబాద్ వాతావరణ కేంద్రం
మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో వర్షాలు పడుతాయని వివరించింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
మరో మూడు రోజుల పాటు వర్షాలు
రాగల 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. తదుపరి 24 గంటల్లో మరింత బలపడి తీవ్రవాయుగుండంగా మారే అవకాశముందని తెలిపింది. దాని ప్రభావంతో వచ్చే మూడ్రోజుల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేకచోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర అండమాన్ పరిసరాల్లో అక్టోబర్ 14న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.