ఏపీలోని అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం ఇమాంపురం గ్రామస్థులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీలు, వర్గాలకు అతీతంగా స్థానిక ఎన్నికలలో పాల్గొనకూడదని నిర్ణయించారు. గ్రామంలో దాదాపు 300 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఇక్కడి ప్రజలు అనారోగ్యానికి గురైతే సమీపంలోని కదిరిపల్లి మీదుగా నాగసముద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలి. అత్యవసర పరిస్థితి అయితే 30 కిలోమీటర్ల దూరంలోని గుంతకల్లుకు చేరుకోవాల్సి ఉంటోంది. సరైన రోడ్డు సదుపాయాలు లేకపోవడం వల్ల మార్గమధ్యలోనే చాలామంది ప్రాణాలు కోల్పోయారని గ్రామస్థులు చెబుతున్నారు.
రోడ్డు దిగ్బంధం...
ఇమాంపురం గ్రామం.... కదిరిపల్లి, అయ్యవారిపల్లితో కలిపి పంచాయతీగా ఏర్పడింది. ఈ గ్రామానికి రాకపోకలు సాగించాలంటే 3 కి.మీ దూరంలోని కదిరిపల్లి మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఆ ఏకైక మార్గం మధ్యలో స్థానికంగా పలుకుబడి ఉన్న ఓ వ్యక్తి బండరాళ్లు వేశారు. దీనివల్ల రాకపోకలు నిలిచిపోయాయి. వీటిని తొలిగించాలని ఎన్నోసార్లు పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఇమాంపురం గ్రామస్థులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇక ఈ ఊరికి వెళ్లాలంటే 15 కిలోమీటర్లు నడుచుకుంటూ పొలాల మార్గాన వెళ్లాల్సి వస్తోంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా తమ పంట పొల్లాలోకి రావద్దంటూ తమను నిలువరిస్తున్నారని ఆ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.