పగలు ఆలయంలో పనిచేసే ఓ పూజారి... చీకటిపడితే చాలు సైకిల్ దొంగతనాలు చేసిన ఉదంతం హైదరాబాద్ మహా నగరంలో వెలుగులోకి వచ్చింది. ఈ ఫొటోలో కనిపించే యువకుడి పేరు సిద్ధార్థ శర్మ.. మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పీఎస్ మంగాపురంలో నివసిస్తున్నాడు. వేదపాఠశాలలో విద్యను అభ్యసించి ఆతరువాత పూజరిగా జీవనం సాగించేవాడు. కొన్నిరోజులుగా పబ్జి గేమ్ జల్సాకు అలవాటుపడి.. చోరీని ప్రవృత్తిగా ఎంచుకొన్నాడు.
పూజ చేస్తే సైకిల్ గిఫ్ట్ ఇచ్చారు..
మల్కాజిగిరి, నేరేడ్మెట్, కుషాయిగూడ, నాచారంలో పగటిపూట పూజరిగా పని చేస్తూ.. రాత్రి సైకిల్ దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ప్రతిరోజు పూజ చేసేందుకు ఓ ఇంటికి వెళ్లేవాడు.. తిరిగి వచ్చేటప్పుడు ఆ ఇంట్లో సైకిల్‌ను మాయం చేసేవాడు. కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి ప్రశ్నించగా.. తనకు తెలిసిన వాళ్ల దగ్గర పూజ చేస్తే సైకిల్ గిఫ్ట్ ఇచ్చారని నమ్మించాడు.
ఇలా దాదాపు 31 సైకిళ్లను చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. సుమారు వీటి విలువ రూ.3 లక్షల 50 వేలు ఉంటుందని వెల్లడించారు. నిందితుడు సిద్ధార్థ శర్మను అరెస్ట్ చేసి, చోరీ చేసిన వాటిని స్వాధీనం చేసుకొని.. రిమాండ్‌కు తరలించారు.
ఇవీ చూడండి: హీరా గ్రూప్స్ ఎండీ నౌహీరాషేక్ విడుదల... మళ్లీ అరెస్ట్