మూసీ నుంచి నిత్యం 100-150 ట్రాక్టర్ల ఇసుక అక్రమంగా తరలిపోతోంది. భూగర్భజలాలు పడిపోతున్నాయి..రోడ్లు ఛిద్రమవుతున్నాయి..నిరంతరం ఇసుక ట్రాక్టర్ల సంచారంతో నిద్ర కరువవుతోంది.. ఊపిరితిత్తుల్లోకి ధూళికణాలు చేరుతున్నాయి.. అక్రమాల్ని అడ్డుకోవాల్సిన, ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు మామూళ్లు గుంజుతూ దందాను ప్రోత్సహిస్తున్నారు. అధికారులే కాపాడాలి’’
- ఇది సూర్యాపేట జిల్లా అర్వపల్లి సమీపంలోని ఉయ్యాలవాడ గ్రామస్థుల ఆవేదన
రాష్ట్రంలోని గోదావరి, కృష్ణా, మూసీ, మంజీరా వంటి నదులు, మరికొన్ని వాగుల నుంచి అక్రమంగా ఇసుకను తోడేస్తున్నారు. ప్రజాప్రతినిధుల అండతో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ప్రకృతి సంపదను యథేచ్ఛగా కొల్లగొడుతూ.. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. ఇసుక అక్రమరవాణాను అడ్డుకుంటున్నారని ఇటీవలే మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో ఇద్దరు యువకుల్ని చితకబాదిన అక్రమార్కులు ఓ యువకుడిపై కత్తితో దాడిచేయడం ఇసుక మాఫియా అరాచకాలకు అద్దం పడుతోంది.
రూ.లక్షల్లో మామూళ్లు
గోదావరిపై మంచిర్యాల జిల్లాలో 8 ఇసుకరీచ్‌లు ఉన్నాయి. లారీల్లో పరిమితికి మించి ఇసుక నింపి గుత్తేదారులు సొమ్ము చేసుకుంటుంటే.. ఓవర్‌లోడ్ కేసులు పెట్టకుండా అధికారులు సహకరిస్తున్నారు. ఇక్కడ ఒక్కో గుత్తేదారు రూ.30వేల చొప్పున నెలకు రూ.2.40 లక్షలు ఓ కీలకశాఖకు చెందిన నాలుగు మండలాల అధికారులకు ముట్టజెబుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఫిబ్రవరి మూడోవారంలో కోటపల్లి నుంచి 30 ఇసుక లారీలు ఓవర్‌లోడుతో వెళ్లాయి. మంచిర్యాల జిల్లా సరిహద్దులు దాటే వరకు సాఫీగా సాగిపోయాయి. వాటిని పక్క జిల్లా కరీంనగర్‌లో ఆర్టీఏ అధికారులు పట్టుకుని సీజ్ చేయడం గమనార్హం.
కీలక నేతల నుంచి ఒత్తిళ్లు
- ఇసుక అక్రమ రవాణా విషయంలో దక్షిణ తెలంగాణలోని ఒకజిల్లాలో కీలక ప్రజాప్రతినిధుల నుంచి అధికారులపై ఒత్తిడి ఉంది.
కేసులు పెడుతూ వెళితే ఇసుక ధరలు పెరిగి..ప్రజలపై భారం పడుతుందంటూ సూచనతో కూడిన హెచ్చరికలు వెళ్లాయి. ఈ క్రమంలో దాడులు నామమాత్రం చేసిన అధికారులు ఇసుకాసురుల నుంచి ట్రిప్పులు, నెలవారీగా వసూళ్లు మొదలుపెట్టారు. - మహబూబాబాద్ జిల్లాలో నెల్లికుదురు, తొర్రూరు, నర్సింహులపేట, తదితర మండలాల్లో ఆకేరు వాగు నుంచి 20 ఏళ్లుగా ఇసుకను తోడేస్తున్నారు. రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన చెక్‌డ్యాంలు దెబ్బతినడంతో రెండు పంటలకు నీరందించే వాగు వానాకాలం పంటకే పరిమితమైంది. వాగులో ఇసుక తవ్వకాలపై రెవెన్యూశాఖ జారీచేసిన కూపన్లను కలెక్టర్ రద్దు చేయించినా అది తాత్కాలికమే అయింది. తర్వాత ఓ నియోజకవర్గ కీలక ప్రజాప్రతినిధి జోక్యంతో కూపన్ల జారీ మళ్లీ మొదలైంది. అవి కూడా ఆ ప్రజాప్రతినిధి అనుచరులకే ఇస్తున్నారు.
- వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం నుంచి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, పెద్దవంగర ప్రాంతాలకు ట్రాక్టర్లలో ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. అరికట్టాల్సిన పోలీసులు ఇసుక ట్రాక్టర్ల యాజమానుల నుంచి నెలవారీ ముడుపులు అందుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి.
పోలీస్‌స్టేషన్ల ముందు నుంచే
రాత్రి సమయాల్లో ఇసుక తవ్వకాలకు అనుమతులు ఉండవు. పూర్వ మహబూబ్‌నగర్ జిల్లాలోని దుందుభి వాగులో రాత్రి 10 గంటల నుంచి ఇసుకను తవ్వి టిప్పర్లు, ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. పెద్దవాగు వెంబడి ఇసుక రీచ్‌లను కొందరు నేతలు పంచుకున్నారు. జడ్చర్ల, రాజాపూర్, బాలానగర్, మక్తల్, మరికల్, దేవరకద్ర, మహబూబ్‌నగర్, మూసాపేట, అడ్డాకుల, జడ్చర్ల పోలీసుస్టేషన్ల ముందు నుంచి హైదరాబాద్‌కు రాత్రివేళల్లో ఇసుక తరలిపోతున్నా పట్టించుకోవడంలేదు.
రెండు ప్రభుత్వ విభాగాల్లో ఒక శాఖకు నెలకు ఒక్కో ట్రాక్టరు మీద రూ.2,000 మరో శాఖకు రూ.1,000 చొప్పున మామూళ్లు అందుతున్నట్లు సమాచారం.