హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో... స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంది. భూములకు విలువ పెరగడం వల్ల.. కొందరు అక్రమార్కులు వాటిపై కన్నేశారు. వివాదంలో ఉన్న ప్రైవేటు భూములను కనిపెట్టి వాటిని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సెటిల్మెంట్ల దందాకు పాల్పడుతున్నారు.
తాతల కాలం నుంచి సాగుచేసుకుంటున్న భూమి కబ్జాకు గురవుతోంది. వివాదాలకు చెక్‌పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత‌్వం తెచ్చిన భూ రికార్డుల ప్రక్షాళన.. రెవెన్యూ సిబ్బందికి కాసుల వర్షం కురిపిస్తోంది. సివిల్ వివాదాలు, కోర్టు కేసుల్లో భూములు ఉండగానే అధికారులు లంచాలకు ఆశపడి ఒకరి భూమిని మరొకరి పేరిట మార్చి అక్రమాలకు పాల్పడుతున్నారు. అసలైన పట్టాదారులు, రైతులను కాదని.. ఇతరులకు పట్టాదార్ పాసుపుస్తకాలు జారీ చేశారు. న్యాయం కోసం పలువురు బాధితులు కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోతోంది. రాంపల్లి భూముల విషయంలోనూ న్యాయస్థానాల చుట్టూ తిరగలేక సెటిల్మెంట్‌కు.. వెళ్లామని బాధితులు గోడు వెళ్లబోసుకుంటున్నారు.
ప్రజా ప్రతినిధులు..
నగర శివారుల్లో ఆసైన్డ్ భూములు భారీగా ఉన్నాయి. వాటి ధరలు ఆకాశాన్నంటడం వల్ల భారీగా చేతులు మారుతున్నాయి. భూ వివాదాల వెనుక.. ప్రజాప్రతినిధులు, వారి అనుచరుల పాత్ర ఉంటోంది. ప్రభుత్వ భూముల వివరాలు సేకరించి ఆక్రమించుకుని వాటా ఇవ్వాలంటూ బహిరంగంగా డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.