తెలంగాణ

telangana

Kolleru Lake: ఇష్టారాజ్యంగా తవ్వకాలు.. పట్టించుకునే నాథుడే కరవు.!

అక్కడ నిబంధనలుంటాయి.. కానీ అమలు కావు. చెక్‌పోస్టులు ఉంటాయి.. కానీ అక్రమాలను అడ్డుకోవు. పక్షి అరుపులు తప్ప మరేమీ వినిపించకూడని చోట.. పెద్ద శబ్దాలతో ప్రొక్లైన్లు తవ్వేస్తుంటాయి. అయినా.. అధికారులకు వినిపించదు, కనిపించదు. రాత్రిళ్లు తవ్వడం.. పగలు ఆపడం. ఎక్కడపడితే అక్కడ.. ఎలా కుదిరితే అలా చేపల చెరువులు తవ్వేస్తూ కొల్లేరును కొల్లగొడుతున్నారు అక్రమార్కులు. జరిగేదంతా చట్ట విరుద్ధమే. కానీ.. కొల్లేరు అభయారణ్యం దురాక్రమణను ఆపేదెవరు? అడిగేదెవరు?

By

Published : Jul 22, 2021, 11:38 AM IST

Published : Jul 22, 2021, 11:38 AM IST

Kolleru Lake
కొల్లేరులో అక్రమ తవ్వకాలు

ఎక్కడికక్కడ మోహరించిన ప్రొక్లైన్లు.. అభయారణ్యంలో అడ్డగోలు తవ్వకాలు.. ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తున్న చేపల చెరువులు. ఇదీ కొల్లేరులో జరుగుతున్న తాజా దురాక్రమణ. ఇదంతా ఎక్కడో కాదు. చేపల చెరువుల తవ్వకాన్ని నిషేధించిన కొల్లేరు కాంటూరు పరిధిలోనే. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా శ్రీపర్రు, మానూరు, పైడిచింతపాడు, యగనమెల్లి, వీరమ్మగుంట, మొండికోడు, పల్లవూరు గామాల పరిధిలో ఈ ఆక్రమణల పర్వం మూడు చెరువులు ఆరు గట్లుగా సాగిపోతోంది. శ్రీపర్రు, వీరమ్మగుంట, పల్లవూరు ప్రాంతాల్లో తవ్విన చెరువులను అటవీశాఖ అధికారులు ధ్వంసం చేసినా.. రాత్రిళ్లు మళ్లీ ఆక్రమణలకు తెరతీస్తున్నారు.

ఆరు నెలల్లోనే

ఏలూరు, పెదపాడు, దెందులూరు, ఆకివీడు, భీమడోలు, ఉంగటూరు, నిడమర్రు మండలాల పరిధిలోని గ్రామాల్లో.. 30 నుంచి వందెకరాల విస్తీర్ణంలో చేపల చెరువులు తవ్వుతున్నారు. ఆరు నెలల వ్యవధిలో.. దాదాపు 5 నుంచి 6 వేల ఎకరాల్లో ఆక్రమణలు జరిగిన ఆనవాళ్లున్నాయి. ఒక్క ప్రత్తికోళ్లలంకలోనే వెయ్యెకరాల్లో అక్రమంగా చెరువులు తవ్వారని అంచనా. కొల్లేరు ఆక్రమణలు అడ్డుకోడానికి నిబంధనలు చాలానే ఉన్నాయి. కొల్లేరు అభయారణ్యంలో పదులకొద్దీ తవ్వే యంత్రాలుంచడం చట్టరీత్యా నేరం. ఒకవేళ యంత్రాలు తీసుకెళ్లాలంటే అనుమతులు తీసుకోవాలి. అక్రమంగా ప్రొక్లైన్లు తీసుకెళ్తే సీజ్‌ చేసి కేసులు పెట్టే అధికారం అటవీ అధికారులకు ఉంది.

కొల్లేరు సరస్సులో ఇష్టారాజ్యంగా తవ్వకాలు

కానీ.. అక్కడ జరుగుతోంది అక్రమమని చెప్పేదెవరు? చాలావరకూ ప్రజాప్రతినిధులే బినామీ పేర్లతో చేపల చెరువులు తవ్విస్తున్నారు. రాత్రిళ్లు ప్రొక్లైన్లతో తవ్వడం, పగలు ఏమీ తెలియనట్లు గట్లపై నిలపడం పరిపాటిగా మారింది. ఎకరం చేపల చెరువు లీజు ఏడాదికి లక్షన్నర వరకూ..పలుకుతోంది. దీన్నే సొమ్ము చేసుకుంటున్నారు కొందరు నాయకులు. ఫలితంగానే 2006లో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఐదో కాంటూరు పరిధిలో ధ్వంసం చేసిన చేపల చెరువులు ఇప్పుడు మళ్లీ పుట్టుకొస్తున్నాయి. అభయారణ్యంలో తవ్విన చెరువులను ధ్వంసం చేశామని ఏలూరు అటవీశాఖ రేంజ్ అధికారి కుమార్‌ చెప్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని ప్రజాసంఘాలు అంటున్నాయి.

ఇదీ చదవండి:ఇక ఎగిరిపోవచ్చు... వరంగల్​లో విమానాశ్రయానికి ఏఏఐ గ్రీన్​సిగ్నల్

ABOUT THE AUTHOR

...view details