ఆస్తుల నమోదు ప్రక్రియలో రాష్ట్రం అంతటా మున్సిపల్, పంచాయతీ, రెవెన్యూ యంత్రాంగం తలమునకలై ఉంది. పట్టణ ప్రణాళికా విభాగం సిబ్బంది ఆస్తుల నమోదు సందర్భంగా కొత్తగా నిర్మించుకున్న గృహాలు, ఇంటి నంబర్లు కేటాయించనివి, ఆస్తుల విలువ లెక్కించని వాటి విషయంలో దృష్టి పెడుతున్నారు. మున్సిపల్ సిబ్బంది అంతా తీరక లేకుండా ఉన్నారు. పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది గ్రామీణ ప్రాంతాల్లో నివాసాల లెక్కలు నమోదు చేస్తున్నారు. ఇలా యంత్రాంగం దృష్టంతా ఆస్తుల నమోదుపైనే ఉండటంతో కబ్జాదారులు తెగిస్తున్నారు. తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు క్రియాశీలకంగా ఉన్న ప్రాంతాల్లో కబ్జాలు, నిర్మాణాలను కొంత వరకు కట్టడి చేస్తున్నారు.
సమాచారం అందించే వ్యవస్థ లేకనే...
క్షేత్రస్థాయిలో గుట్టుచప్పుడు కాకుండా చేస్తున్న నిర్మాణాల సమాచారం సకాలంలో పై స్థాయి అధికారులకు అందడం లేదు. భూ దస్త్రాలు, ప్రభుత్వ భూముల వివరాలకు సంబంధించిన దస్త్రాలను వీఆర్వోలు ప్రభుత్వానికి అప్పగించారు. దీంతో క్షేత్రస్థాయిలో భూముల పర్యవేక్షణకు ప్రత్యేకంగా వ్యవస్థ లేకుండా పోయిందని పేర్కొంటున్నారు. ఇది ప్రస్తుతం కొందరు ఆక్రమణదారులకు అవకాశంగా మారిందని చెబుతున్నారు.
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని ప్రభుత్వ భూమిలో వెలసిన భవన నిర్మాణాలను అధికారులు ఇటీవల కూల్చివేసిన దృశ్యమిది. రూ.కోట్లు విలువైన ఈ ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఇక్కడ పిల్లర్లతో పక్కా భవన నిర్మాణం చేపట్టారు. ఉప్పల్ ప్రధాన రహదారి సమీపంలోనూ రూ.5 కోట్ల విలువైన భూమిలో కొందరు పక్కా నిర్మాణాలు చేపట్టగా సమాచారం అందుకున్న అధికారులు కూల్చివేశారు. గాజుల రామారం పరిధిలో కూడా ఇలాంటి కూల్చివేతలు జరిగాయి.