Jeevan Lite Ventilator: కొవిడ్ సమయంలో ఆక్సిజన్ వెంటిలేటర్ల కోసం రోగులు పడిన అవస్థలు అన్నీఇన్నీ కావు. ఆక్సిజన్ అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ దుర్ఘటనలు ఆ తెలుగు పరిశోధకులను కదిలించాయి. అందుకే సమాజానికి తమ వంతుగా ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారు. రోగులకు సులువుగా మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో పనిచేశారు. దానికి వారు చేసిన ఫెలోషిప్ దోహదపడింది. తమ వద్ద ఉన్న సౌకర్యాలను వినియోగించుకుంటూ ఓ వెంటిలేటర్‌ను రూపొందించారు. అదే జీవన్ లైట్..
అలా జీవన్‌లైట్ ఆవిష్కరణకు నాంది:ఐఐటీ హైదరాబాద్‌లో చదువుతున్న సమయంలో 2018లో సెంటర్ ఫర్ హెల్త్‌కేర్ ఇంటర్న్‌షిప్ ఆధ్వర్యంలో ఏరో బయాసిస్ వ్యవస్థాపకులు, జీవన్‌లైట్ రూపకర్తలు సిరిల్ ఆంటోనీ, రాజేశ్ యాదవ్ ఫెలోషిప్ మెుదలుపెట్టారు. ఏడాది కాలం శిక్షణ పూర్తైంది. ఆ తర్వాత కొత్తగా ఏదైనా పరిశోధన చేయాలనుకున్నారు. కరోనా సమయంలో ఎంతో మంది రోగులు వెంటిలేటర్ దొరక్క.. ఆసుపత్రుల్లోని రెస్పిరేటరీ వ్యవస్థ వల్ల రోగులు పడే ఇబ్బందులను చూశారు. దీంతో వెంటిలేటర్ సమస్యల్ని అధిగమించాలని నిర్ణయించుకున్నారు. కొవిడ్ మహమ్మారి పరిస్థితుల్లో వెంటిలేటర్ ప్రాముఖ్యత పెరగడంతో.. వారి ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చిందే జీవన్‌లైట్. ఏడాదిన్నరగా ఈ ప్రాజెక్ట్‌పై పని చేస్తున్నారు.
జీవన్‌లైట్ విశేషాలు:పిల్లలు, పెద్దలు ఉపయోగించుకునేలా జీవన్‌లైట్ రూపొందించారు. వివిధ మోడ్‌లలో ఈ పరికరాన్ని ఉపయోగించేలా.. సీఎమ్‌బీ, ఎస్‌ఐఎమ్‌బీ, పీఎస్‌వీ మోడ్స్ వెంటిలైజేషన్ సౌకర్యాలు కల్పించారు. 5 వోల్టుల బ్యాటరీ బ్యాకప్‌తో.. పదివేల బ్రీత్ ఈవెంట్ లాక్‌లు ఏర్పాటు చేశారు. ఈ పరికరం చాలా సమయం పాటు సులువుగానే రోగులకు సేవలందిస్తుంది. భారతీయ వైద్యారోగ్య పరిస్థితులకు సరిపోయే విధంగా ఈ వెంటిలేటర్ రూపొందించారు.