లిథియం బ్యాటరీకి ప్రత్యామ్నాయంగా ఐఐటీ పరిశోధకుల ఆవిష్కరణ లిథియం అయాన్ బ్యాటరీ వచ్చిన తర్వాత ఎలక్ట్రానికి పరికరాల పనితీరులో అనూహ్యమైన మార్పు వచ్చింది. ప్రతి మనిషి చేతిలో సర్వసాధారణమైన స్మార్ట్‌ఫోన్‌తోపాటు... ఎలక్ట్రిక్ వాహనాల వరకు ఈ లిథియం అయాన్ బ్యాటరీనే గుండె వంటింది. కానీ లిథియం కేవలం కొన్ని దేశాల్లోనే ఉండటం... అది పరిమితంగా లభిస్తుండటంతో ధర అధికంగా ఉంది. ఫలితంగా లిథియం ఉపయోగించే వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. మరోవైపు ఇందులో వాడే కోబాల్ట్, నికెల్, మాంగనీస్ వంటి లోహాల వల్ల పర్యావరణ కాలుష్యమూ అధికమవుతోంది.
సరికొత్త 5వోల్ట్ డ్యుయల్ కార్బన్ బ్యాటరీ..
ఈ సమస్యలకు ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు పరిష్కారం కనుగొన్నారు. రసాయన శాస్త్ర విభాగం అధ్యాపకుడు సురేంద్ర కుమార్ మార్త నేతృత్వంలోని పరిశోధక బృందం... ఈ ఆవిష్కరణ చేసింది. ఈ బృందం సరికొత్త 5వోల్ట్ డ్యుయల్ కార్బన్ బ్యాటరీని అభివృద్ధి చేసింది. బ్యాటరీల్లో ఉండే యానోడ్, క్యాథోడ్‌లుగా కార్బన్ ఫైబర్ మ్యాట్స్‌ను ఉపయోగించారు. వీరి ఆవిష్కరణలో ఇదే కీలకాంశం. దీనివల్ల ఇతర విషపూరిత, ఖర్చుతో కూడుకున్న లోహాలు వాడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.
ఎనర్జీ డెన్సిటీ 100 వాట్స్ పర్ కేజీ
అమెరికాకు చెందిన ఓక్రిడ్జ్ నేషనల్ ల్యాబ్, ముంబయికి చెందిన నావెల్ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబ్‌లతో కలిసి ఈ బృందం పనిచేశారు. నావెల్ రీసెర్చ్ బోర్డు ఈ పరిశోధనకు సహాయ సహకారాలు అందించింది. ఎలక్ట్రిక్ వాహనాలు, వైద్య ఉపకరణాలతో పాటు ఇతర రంగాల్లోనూ వీటిని ఉపయోగించవచ్చని వీరు అంటున్నారు. ప్రస్తుతం వీరు రూపొందించిన ఈ బ్యాటరీ ఎనర్జీ డెన్సిటీ 100 వాట్స్ పర్ కేజీగా ఉంది. దీనిని 150వాట్స్ పర్ కేజీగా పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ డ్యుయల్ కార్బన్ బ్యాటరీ లిథియం అయాన్ బ్యాటరీకి ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని ఆవిష్కర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పర్యావరణానికి ప్రయోజనం..
డ్యూయల్ కార్బన్ బ్యాటరీలో కోబాల్డ్, నికెల్, మాంగనీస్ వంటి విషపూరితమైన లోహాలు వాడాల్సిన అవసరం లేదు. దీని వల్ల పర్యావరణానికి ప్రయోజనం కలుగుతుంది. అన్నింటి కంటే ముఖ్యంగా లిథియాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం తప్పుతుంది.
ఇవీ చూడండి:'ఒకరికి కరోనా వస్తే.. 30మందిని ట్రేస్ చేయాలి'