తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనా నేపథ్యంలో ఇవి పాటిస్తే ఫ్రీలాన్సర్‌గానూ రాణించవచ్చు... !

ఉద్యోగం అంటే ఉదయాన్నే ఆఫీసుకి వెళ్లి సాయంత్రం వరకు అక్కడే పని చేసి మళ్లీ రాత్రికి ఇంటికి చేరుకోవడం.. ఇది ఒకప్పటి మాట.. ఇప్పుడు ఇంటి దగ్గర్నుంచి కూడా జాబ్ చేసే వెసులుబాటు ఉంటోంది. ప్రత్యేకించి కరోనా నేపథ్యంలో - ఇప్పుడు చాలా సంస్థలు 'వర్క్ ఫ్రమ్ హోమ్' అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చాయి. అలాగే - ప్రత్యేకించి ఒక సంస్థ కోసం కాకుండా నచ్చిన సంస్థలకు నచ్చిన రీతిలో పని చేసే సౌలభ్యం కూడా ఎప్పటినుంచోనే అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అదే ఫ్రీలాన్సింగ్.. కరోనా నేపథ్యంలో- రెగ్యులర్ ఉద్యోగాలకు భద్రత లేకపోవడంతో కొంతమంది ఫ్రీలాన్సింగ్ వైపు కూడా మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో- ఫ్రీలాన్సింగ్ గురించి ఆలోచించేవారు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి తెలుసుకుందాం రండి...

కరోనా నేపథ్యంలో ఇవి పాటిస్తే ఫ్రీలాన్సర్‌గానూ రాణించవచ్చు... !
కరోనా నేపథ్యంలో ఇవి పాటిస్తే ఫ్రీలాన్సర్‌గానూ రాణించవచ్చు... !

By

Published : Aug 8, 2020, 4:01 PM IST

క్రమశిక్షణ ముఖ్యం..

'ఫ్రీలాన్సింగ్ అంటే ఇంట్లో చేసుకునేదే కదా! మనకి కుదిరినప్పుడు, నచ్చినంతసేపు ఇష్టం వచ్చినట్లు పని చేసుకోవచ్చులే!'- ఫ్రీలాన్సింగ్ అనగానే చాలామంది మదిలో మెదిలే ఆలోచనలు ఇలానే సాగుతాయి. అయితే అది పూర్తిగా పొరపాటు. చేసే పనిలో నాణ్యత కొరవడకుండా ఉండాలంటే అందుకు తగిన క్రమశిక్షణ కలిగి ఉండడం కూడా చాలా అవసరం.

ఇంటివద్ద ఉన్నా అంతే నిబద్ధత అవసరం...

ఆఫీసుకి వెళ్తే ఎంత నియమ, నిబద్ధతలతో పని చేస్తామో ఇంటి పట్టున ఉండి చేసే పనిలో కూడా అలానే ఉండాలి. ముఖ్యంగా బద్ధకాన్ని మన దరి చేరనీయకూడదు. లేదంటే అది వాయిదాల పర్వానికి తెర తీసి రాణించాలనుకున్న కెరీర్‌ని కాస్తా అటకెక్కిస్తుంది.

ప్రాథమికాంశాలపై అవగాహన..

ఫ్రీలాన్సింగ్ చేయాలని అనుకుంటున్నారు.. బాగానే ఉంది.. మరి, దానికి సంబంధించిన ప్రాథమికాంశాలపై కూడా అవగాహన ఉండాలి కదా! అందుకే మీరు పని చేయాలనుకుంటున్న రంగంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి నిపుణులను అడిగి తెలుసుకోవడం లేదా అదే రంగంలో పని చేస్తున్న పరిచయస్థుల ద్వారా వాకబు చేసి వివరాలు సేకరించడం.. వంటివి చేయాలి.

అలా చేస్తే అవగాహన ఏర్పడుతుంది...

తద్వారా ప్రస్తుతం సంస్థలు మనలో కోరుకుంటున్న నైపుణ్యాలు, పని గంటలు, ప్రాజెక్టు వివరాలు, డబ్బు చెల్లించే విధానం.. మొదలైన అంశాలపై ఒక అవగాహన ఏర్పడుతుంది. దీని ద్వారా మనం ఎంత సేపు పని చేయాలి? మన కష్టానికి ప్రతిఫలంగా సంస్థ నుంచి ఎంత ఆశించవచ్చు.. అనే అంశాల్లో మనమూ ఒక అంచనాకి వచ్చే వీలు ఉంటుంది.

నెట్‌వర్క్ కూడా ముఖ్యమే..

ప్రస్తుతం ఏ రంగంలో రాణించాలన్నా అందుకు తగినవిధంగా నెట్‌వర్క్ కలిగి ఉండడం కూడా ముఖ్యమైన అంశాల్లో ఒకటిగా మారిపోయింది. ఈ క్రమంలో మీరు ఫ్రీలాన్సింగ్ చేయాలనుకునే రంగంలో మీకు తెలిసిన వారితో మీరూ ఒక నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకోవడం మంచిది. దాని ద్వారా ఆయా రంగాల్లో వస్తున్న మార్పులు- చేర్పుల గురించే కాకుండా కొత్త ఒరవడుల గురించి కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఆయా రంగాల్లో ఉన్న అవకాశాల విస్తృతి గురించి మనకు తెలుస్తుంది.

పక్కాగా మాట్లాడుకోవాలి..

ఏదైనా ఒక సంస్థ కోసం పని చేయడం ప్రారంభించే ముందే పనికి సంబంధించిన సమస్త వివరాల గురించి పక్కాగా మాట్లాడుకోవాలి. పనికి వారు ఇచ్చే వేతనం దగ్గర్నుంచి రోజుకి ఎంత మేరకు మన సేవలు అందించాలి? అందులో పాటించాల్సిన నియమాలు, ఎన్ని రోజుల వరకు ఆ ప్రాజెక్టు కోసం పని చేయాలి.. మొదలైన అన్ని అంశాల పైనా పక్కాగా అవగాహన ఏర్పడిన తర్వాతే పని చేయడం ప్రారంభించాలి. ఈ విషయంలో అటు సంస్థకు లేదా ఇటు మీకు ఎలాంటి సందేహాలున్నా నిరభ్యంతరంగా, నిస్సందేహంగా మాట్లాడి నివృత్తి చేసుకోవడం చాలా ముఖ్యం.

ఇవీ తెలుసుకోండి..

* ఇబ్బంది పడుతూ పని చేయడం అస్సలు సరైన పద్ధతి కాదు. అది ఎక్కడైనా సరే.. కాబట్టి అలాంటి పనులు చేయడానికి నిస్సందేహంగా 'నో' చెప్పడం నేర్చుకోవాలి.

* మనం ఏ విధమైన పని చేయాలనుకుంటున్నామో సంస్థకు శాంపిల్స్ చూపించడం ద్వారా అదే పని చేసే అవకాశం ఉంటుంది. లేదంటే సంస్థకు తగినట్లుగా మీరు అవసరమైన మార్పులు చేసుకోవడం కాస్త ఇబ్బంది అనిపించవచ్చు.

* పని ఇంటి నుంచి చేసినా లేక ఆఫీసులో చేసినా పూర్తి ఏకాగ్రత ఉండడం తప్పనిసరి.

* పని ఏదైనా అందులో మన ప్రతిభని ప్రదర్శించినప్పుడే దానికి మరింత సానబెట్టి చక్కని అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది.

* ఫ్రీలాన్సింగ్ చేసేటప్పుడు పనికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ సంస్థతో పారదర్శకంగా మెలగడం చాలా అవసరం.

* ఆయా రంగాల వారీగా ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్టులు ఆఫర్ చేసే పలు వెబ్‌సైట్లు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటిలో విశ్వసనీయమైన వాటిని ఎంచుకుని అవకాశాల కోసం ప్రయత్నించవచ్చు.

ఇవీ చూడండి : సీఆర్డీఏపై హైకోర్టు స్టే వెకేట్​ చేయాలని సుప్రీంలో ఏపీ ప్రభుత్వం పిటిషన్‌

ABOUT THE AUTHOR

...view details