రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరికొంత కాలం కొనసాగితే భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్, ప్రముఖ ఆర్థికవేత్త సి.రంగరాజన్ అన్నారు. హైదరాబాద్‌లోని ఆర్థిక, సామాజిక అధ్యయన కేంద్రం (సెస్)లో బుధవారం నిర్వహించిన ‘ఇటీవల కాలంలో భారతదేశాభివృద్ధి- అనుభవాలు’ అనే అంశంపై ఆయన ‘బి.పి.ఆర్.విఠల్ స్మారకోపన్యాసం’ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్‌బీఐ మాజీ గవర్నర్ వై.వి.రెడ్డి, రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు జీఆర్‌రెడ్డి, సెస్ ఛైర్మన్ దిలీప్ ఎం.నాచనే, డైరెక్టర్ రేవతి, ప్రముఖ జర్నలిస్ట్ సంజయ్‌బారు తదితరులు పాల్గొన్నారు.
అయిదేళ్లు 9% వృద్ధిరేటు సాధిస్తేనే..
ఈ సందర్భంగా రంగరాజన్ మాట్లాడుతూ.. ‘‘కొవిడ్ పరిస్థితుల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోన్న తరుణంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తలెత్తటం ప్రభావం చూపుతోంది. చమురు ధరలు పెరిగి ద్రవ్యోల్బణానికి దారి తీసే అవకాశం ఉంది. ప్రస్తుతం 2.7 ట్రిలియన్ డాలర్లు ఉన్న మన ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు చేరాలంటే వరుసగా అయిదేళ్లపాటు 9 శాతం వృద్ధిరేటు సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వృద్ధిరేటు 8 శాతంగా అంచనా వేసినా.. పరిస్థితుల నేపథ్యంలో 7 శాతంగా ఉండే అవకాశం ఉంది. దేశ ఆర్థికాభివృద్ధిలో సంస్కరణలు, పెట్టుబడులది కీలక పాత్ర. ప్రైవేటు పెట్టుబడులు తగ్గుతుంటే.. ప్రభుత్వ పెట్టుబడులను పెంచాల్సిన అవసరం ఉంది. వ్యవసాయరంగం కీలకంగా ఉన్న భారతదేశంలో ఆహారశుద్ధి వంటివాటికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. ఆహారశుద్ధి పరిశ్రమలకు ప్రోత్సాహంతో రైతుల రాబడిలో సానుకూల ఫలితాలు ఉంటాయి. నోట్ల రద్దు, కొత్తగా జీఎస్టీ తీసుకురావడం వృద్ధిరేటుపై ప్రభావం చూపాయి. ప్రధానంగా కూలీలు, వలస కార్మికులపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. దేశంలో పేదరికాన్ని తగ్గించడంలో గ్రామీణ ఉపాధి హామీ, రేషన్ పథకాలు కీలకంగా వ్యవహరించాయి’’ అని రంగరాజన్ వివరించారు.
ఇదీచూడండి:మేరియుపొల్ థియేటర్‌పై బాంబుల వర్షం.. భారీగా మృతుల సంఖ్య!