ఏపీ విజయనగరం జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం విగ్రహ ధ్వంసం ఘటనపై రాజకీయ పార్టీలు, హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనపై భాజపా- తెదేపా నేతలు ఆందోళనకు దిగగా.. పలు హిందూ సంఘాలు మండిపడ్డాయి. రామతీర్థం కొండపై తెదేపా ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. హిందూ ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్నా... వైకాపా ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటూ... రామతీర్థంపై భాజపా నేతలు నిరసన దీక్ష చేపట్టారు. రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేయడమంటే హిందూవుల మనోభావాలను దెబ్బతీయడమే అని విశాఖలో హిందూ సంఘాలు ఆరోపించాయి. అభినవ భద్రాద్రిగా భావించే.. రామతీర్థం శ్రీరాముడి విగ్రహం ధ్వంసం చేయటం దురదృష్టకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఏం జరిగింది
మంగళవారం సాయంత్రం రామతీర్థం కొండపైనున్న రాముడి విగ్రహాన్ని.. గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. తల లేని రాముడి విగ్రహాన్ని గమనించిన భక్తులు.. ఆలయ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎస్పీ రాజకుమారితో పాటు స్థానిక పోలీసులు విగ్రహాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం గాలింపు చేపట్టారు. విగ్రహ ధ్వంసం ఘటనపై విచారించేందుకు ఆర్‌జేసీ డి.భ్రమరాంబను విచారణాధికారిగా నియమించారు. రామతీర్థం కొండపై రామకొలనులో రాముడి విగ్రహ శకలం లభ్యమైంది. లోతైన కొలనులో ఉదయం నుంచి గాలింపు చేపట్టగా... శ్రీరాముడి విగ్రహ శకలం దొరికింది. చినజీయర్‌స్వామి ఆశ్రమం ప్రతినిధులతో విగ్రహ పునఃప్రతిష్ఠకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఉదాహరణ: చంద్రబాబు
రామతీర్థం ఘటనపై రాజకీయపక్షాలు తీవ్రంగా స్పందించాయి. రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. 4 శతాబ్దాల చరిత్ర ఉన్న రామతీర్థంలో విగ్రహాల ధ్వంసం.. వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఉదాహరణన్నారు. దేవాలయాలపై వరుస దాడులు, విధ్వంసాలు అనేకం జరుగుతున్నా.. సీఎం జగన్ చోద్యం చూడటం గర్హనీయమన్నారు.
పథకం ప్రకారమే దాడులు: పవన్