ఒలింపిక్స్‌లో(Olympics) అన్ని క్రీడలు కనిపిస్తాయి. కానీ, క్రికెట్‌కు మాత్రం చోటు లేదు. దీంతో జెంటిల్మెన్ గేమ్‌ను కూడా విశ్వక్రీడల్లో చేర్చాలనేది అభిమానుల నుంచి కొంతకాలంగా వినిపిస్తున్న డిమాండ్. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో (Los Angeles Olympics 2028) ఇది సాధ్యం కావొచ్చు. ఇదే విషయమై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) అధ్యక్షుడు గ్రెగ్ బార్క్లే(Greg Barclay) స్పందించారు. 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌నూ భాగం చేసేందుకు క్రికెట్ తరఫున బిడ్ వేసేందుకు ఐసీసీ సన్నాహాలు జరుపుతోందని వెల్లడించారు.
"ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఒలింపిక్స్‌ను సజావుగా నిర్వహించిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీతో పాటు జపాన్ ప్రభుత్వ యంత్రాంగానికి అభినందనలు. విశ్వక్రీడలు చాలా అద్భుతంగా జరిగాయి. భవిష్యత్‌లోనైనా క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చూడాలని మేము భావిస్తున్నాం. మా క్రీడకు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికి పైగా అభిమానులున్నారు. దాదాపు 90 శాతం మంది క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చూడాలని భావిస్తున్నారు. అదే విధంగా క్రికెట్‌కు భవిష్యత్‌లో మరింత క్రేజ్ తెచ్చేందుకు మా క్రీడను ఒలింపిక్స్‌లో ప్రవేశపెట్టాలని నిర్ణయించాం. ఒలింపిక్స్‌కు క్రికెట్ కొత్త అలంకరణగా మేము భావిస్తున్నాం. అయితే మా క్రీడను అందులో చేర్చడం అంత సులభమైనది కాదని మాకు తెలుసు. క్రికెట్‌ను విశ్వక్రీడల్లో చేర్చేందుకు ఇదే సరైన సమయమని మేము ఆశిస్తున్నాం".
- గ్రెగ్ బార్క్లే, ఐసీసీ అధ్యక్షుడు
అమెరికాలో 3 కోట్ల మందికి పైగా క్రికెట్ అభిమానులున్నారు. అందుకే 2028లో లాస్ఏంజెలెస్ వేదికగా జరగనున్న ఒలింపిక్స్‌లో ఈ క్రీడను చేర్చేందుకు సరైన సమయమని ఐసీసీ వర్గాలు భావిస్తున్నాయి.