IAS Praveen Prakash sit on knees:సివిల్ సర్వెంట్లు అంటే అది ఎంత ఉన్నతమైన ఉద్యోగమో మనకు తెలిసిందే. ప్రజలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో వారిది కీలక పాత్ర. ప్రభుత్వాన్ని నడిపించే పాలకులు సైతం.. వారి సూచనల మేరకే నడుచుకుంటారు. అలాంటి ఐఏఎస్ అధికారులు.. ప్రజాప్రతినిధుల ముందు వినయం ప్రదర్శిస్తే అది చూసే సాధారణ ప్రజలకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కారణమేదైనా కావొచ్చు.. అత్యున్నత స్థాయిలో ఉండే సివిల్ సర్వెంట్లు ఇలా ప్రవర్తించడమేంటని సందేహం రాక మానదు. ఏపీలో బుధవారం జరిగిన గణతంత్ర వేడుకల్లో జరిగిన ఓ పరిణామం మళ్లీ ఈ అనుమాన్ని రేకెత్తిస్తోంది. అసలేం జరిగిందంటే..
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సహా పలువురు ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు. ముందు వరుసలో సీఎం.. అధికారులు ఆయన వెనుక కూర్చొన్నారు. ఈ సందర్భంగా ఏదో అంశంపై మాట్లాడేందుకు సీఎం జగన్ పిలవగానే వచ్చిన ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ మోకాళ్లపై కూర్చొని ఆయనతో మాట్లాడారు. అంతమంది ప్రముఖుల మధ్యలో ఓ ఐఏఎస్ అధికారి.. అలా మోకాళ్లపై కూర్చొని మాట్లాడటం పలు చర్చలకు తావిస్తోంది. ఆ దృశ్యాలు కెమెరాల కంటికి చిక్కాయి. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.