అమరావతి ప్రాజెక్టు తప్పు అని ప్రజలంటే వారికి క్షమాపణ చెప్పటానికి తాను సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలంతా అమరావతి వద్దు అంటే తామూ అందుకనుగుణంగానే వ్యవహరిస్తామని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో ఆసుపత్రులు లేవు కాబట్టే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ వర్తింపజేశారని ఆయన విమర్శించారు.
అప్పుడు స్వాగతించారు... ఇప్పుడు నిలిపివేశారు
తెదేపా హయాంలో జరిగిన అభివృద్ధిపై చంద్రబాబు వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు. భవనాలన్నీ గ్రాఫిక్స్ కాదు నేలపై నిజాలు పేరిట ఈ వీడియో ప్రదర్శించారు. ఆరునెలల్లో పూర్తయ్యే నిర్మాణాలను కూడా నిలిపివేశారని చంద్రబాబు ఆక్షేపించారు. నిర్మాణాలు పూర్తిచేస్తే ఈ పాటికి ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌లు అమరావతిలోనే ఉండేవాళ్లని ఆయన అన్నారు. రాజధానిలో 30 వేల ఎకరాల్లో ఉండాలని నాడు జగన్ చెప్పారని గుర్తుచేశారు. విజయవాడలో రాజధాని నిర్ణయాన్ని జగన్ కూడా ఆహ్వానించారని చెప్పారు. ఇప్పుడు అమరావతి నిర్మాణాన్ని గ్రాఫిక్స్ అని ఎగతాళి చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
ధీటైన నగరం లేకుంటే ఆదాయం ఎలా వస్తుంది..?
అమరావతి భవనాల వాస్తవ స్థితిగతులపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అమరావతి గ్రీన్ ఫీల్డ్ నగరం కాబట్టే హైదరాబాద్ కంటే ఇంకా మెరుగ్గా అభివృద్ధి చేయగలిగేవాళ్లమని ఆయన అభిప్రాయపడ్డారు. అమరావతి పనులు ముమ్మరంగా జరిగినప్పుడు 50వేల మంది పనిచేశారని గుర్తుచేశారు. నగరం ఉంటేనే అన్ని రకాల ఉపాధి అవకాశాలు వస్తాయని అన్నారు. ప్రతి గ్రామంలో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలంటే డబ్బులు కావాలన్న చంద్రబాబు... సంపద సృష్టించలేకపోతే ఆదాయం ఎలా వస్తుందని ప్రశ్నించారు. అమరావతి సంపద సృష్టించే ప్రాజెక్టని చంద్రబాబు ఉద్ఘాటించారు.