వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా జంతువులు మరణిస్తున్నాయి. వారం రోజుల్లో రెండు సింహాలు మృత్యువాతపడటమే ఇందుకు నిదర్శనం. దానికి ముందు నీటి గుర్రాలు, సాంబార్, నీల్‌గాయ్ తదితర జంతువులు మృతి చెందాయి. గత ఏడాది చివర్లో 21 సంవత్సరాల మగ రాయల్ బెంగాల్ తెల్ల పులి చనిపోయింది. ఇటీవలి వరకు సందర్శకులను కనువిందు చేసిన ఆయా మూగజీవులు వరుసగా కాలం చేస్తుండటం ఆందోళనకు తావిస్తోంది.
మరణ మృదంగం: వారంలో రెండు సింహాలు మృత్యువాత - animals consequent deaths in hyderabad zoo
భాగ్యనగర జంతు ప్రదర్శన శాలలో కొంతకాలంగా వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో జంతువులు మరణిస్తున్నాయి. మొన్నటి వరకు సందర్శకులను కనువిందు చేసిన మూగజీవులు వరుసగా కాలం చేస్తుండటం జంతు ప్రేమికుల్లో ఆందోళన కలిగిస్తోంది.

నగర జూపార్కులోని ఆడ ఏనుగు రాణి దేశంలోని అన్ని జూపార్కుల్లోని ఏనుగుల కన్నా వయసులో పెద్దది. ఏనుగుల జీవితకాలం 70 ఏళ్లు కాగా జూపార్కులోని రాణి వయసు మాత్రం 82 సంవత్సరాలు. ఇప్పటికీ ఆరోగ్యంగా ఉంది. జూకు వచ్చినప్పట్నుంచి ఒంటరి జీవితం అనుభవిస్తున్న ఆడ చింపాంజి(సూజీ) సైతం గరిష్ఠ వయసుకు చేరుకుంది. చింపాంజి జీవితకాలం 38 ఏళ్లు. 34 సంవత్సరాల సూజీని 2011లో సహారా సంస్థ జూపార్కుకు బహుమతిగా ఇచ్చింది. రాణి అనే పేరుగల ఓ పెద్దపులి సైతం 20వ ఏట అడుగుపెట్టింది. సింహాలు, పులుల జీవితకాలం 18 ఏళ్లు. జూలోని మగ కొండచిలువ వయసు 16 ఏళ్లు. వాటి జీవితకాలం 20 సంవత్సరాలు. ఇలాంటి మరిన్ని మూగజీవులు వృద్ధాప్యంలోకి చేరుకున్నాయి. నిత్యం ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నా అధికారుల వైపు నుంచి దిద్దుబాటు చర్యలు లేవు. మృతిచెందిన జంతువుల స్థానంలో కొత్తవాటిని చేర్చేందుకు అధికారులు ఆసక్తి చూపట్లేదు. మరోవైపు లాక్‌డౌన్ కాలంలో జూపార్కులో కూనల సందడి మొదలైంది. రెండు సింహం, మూడు పులి పిల్లలు, ఆరు నక్క కూనలు, మూడు నిప్పుకోడి పిల్లలు జన్మించాయి.
వారంలో రెండు సింహాలు..
- జూన్ 5న జ్యోతి అనే 21 ఏళ్ల ఆడ సింహం మృతి చెందింది. వృద్ధాప్యం వల్ల దాని ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ సోకిందని, మూత్రపిండాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు.
- జూన్ 2న ఆకాశ్ అనే మగ సింహం చనిపోయింది. అది 2000 జనవరి 19న జన్మించింది. వయసు మీదపడటంతో అనారోగ్యానికి గురై ఆహారం తీసుకోవడంలో ఇబ్బందిపడేది. ఆకాశ్‌తోపాటు జ్యోతికి సైతం పళ్లు దెబ్బతినడంతో కొన్ని నెలలుగా చికెన్ సూప్, చిన్న ముక్కలుగా కత్తిరించిన ఎద్దు మాంసం, కుందేళ్లను ఆహారంగా ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
ఇవి కాకుండా ఇటీవల నీటి గుర్రం, సాంబార్, ఇతరత్రా జంతువులు, పక్షులు, సరీసృపాలు మృత్యువాతపడ్డాయి. వృద్ధాప్యంతో సహజ మరణానికి గురవుతున్నాయని, నాణ్యమైన ఆహారం, వైద్య సేవల వల్ల అధిక శాతం మూగజీవులు గరిష్ఠ వయసుకన్నా ఎక్కువ రోజులు జీవిస్తున్నాయని జూ అధికారులు వివరించారు.