ట్రాఫిక్ పెండింగ్ చలాన్లు చెల్లించడానికి మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. పెండింగ్ చలాన్లను 50 శాతం రాయితీతో చెల్లించొచ్చని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని వాహనదారులు నమొద్దని సూచించారు.
దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 4 నుంచి 7 వరకు ట్రాఫిక్ పోలీసులు మెగా లోక్ అదాలత్ నిర్వహించనున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ వార్తలను ట్రాఫిక్ పోలీస్ అధికారులు ఖండించారు. అవన్ని నిరాధారమైనవని.. అలాంటి వార్తలు నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. ఇలాంటి నకిలీ వార్తలను షేర్ చేసినా.. ఫార్వార్డ్ చేసిన వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. పెండింగ్ చలాన్లు ఉన్న వాళ్లు సకాలంలో చెల్లించాలని వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు సూచించారు.