మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం అవంచకు చెందిన నర్సింహారెడ్డికి బండి చలానా విషయంలో విచిత్ర ఘటన ఎదురైంది. తనకున్న గ్లామర్ బైక్‌పై రెండు చలాన్లున్నట్లు చరవాణికి మెస్సేజ్ వచ్చింది. ఈ నెల 30న ఇదే వాహనంపై హైదరాబాద్‌లో హెల్మెట్ లేకుండా ముగ్గురు ప్రయాణం చేయటం వల్ల ఆ జరిమానాలు పడ్డాయని అందులోని సారాంశం. ఆ మెస్సేజ్ చూసి అవాక్కవటం నర్సింహారెడ్డి వంతైంది.
అవంచలో బండి ఉంటే... హైదరాబాద్‌లో చలానా పడిందేంటీ...?
మీకు వాహనాలు ఉన్నాయా...? కాస్త జాగ్రత్తగా ఉండండి. మీకు ఏమైన ఫైన్ పడినట్లు సందేశం వస్తే వెంటనే పరిశీలించుకోండి. ఆ జరిమానా మీరు చేసిన పొరపాటు వల్లే పడిందా...? అనేది ఆరా తీసుకోండి. కొందరు వాహనదారులు తమ అతితెలివితో నెంబర్ ప్లేట్ తారుమారు చేసి దర్జాగా తిరుగుతున్నారు.. జరిమానాలు మాత్రం అసలు యాజమానులతో కట్టిస్తున్నారు.
ఎనిమిదేళ్ల క్రితం నర్సింహారెడ్డి... హీరో గ్లామర్ బైక్ కొనుగోలు చేశాడు. రిజిస్ట్రేషన్ చేయించగా... టీఎస్15ఈఏ-3392 నెంబరు కేటాయించారు. నర్సింహారెడ్డి... నర్సాపూర్‌కు, ఆ పక్కనే ఉన్న దౌల్తాబాద్‌కు మాత్రమే ద్విచక్రవాహనంపై వెళ్తాడు. ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే మాత్రం బస్సులనే ఆశ్రయిస్తాడు. అలాంటిది... ఈ నెల 30న ఇదే వాహనంపై హైదరాబాద్‌లో హెల్మెట్ లేకుండా ముగ్గురు ప్రయాణం చేసినందుకు గానూ... 2 ఫైన్లు పడినట్లు చరవాణికి మెస్సేజ్ వచ్చింది. అది చూసి కంగుతిన్న నర్సింహారెడ్డికి చిక్కు ప్రశ్న ఎదురైంది. తానున్నది అవంచ గ్రామంలో అయితే... ఇలా ఎలా వచ్చిందని ఆలోచించాడు. బండి నెంబర్‌తో వెబ్సైట్లో పరిశీలించగా... ఫొటోలు కనిపించాయి. అసలు కథ అప్పుడర్థమైంది. ఆ ఫొటోల్లో ఉన్నది టీవీఎస్ ఎక్సెల్. తనకున్నది గ్లామర్.
ఆ టీవీఎస్ ఎక్సెల్ వాహనదారుడు తన వాహనం నెంబరు వాడుతున్నాడని తెలుసుకున్న నర్సింహారెడ్డి నర్సాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.