Telangana Tea Championship 2022: చాయ్.. అంటే ఇష్టపడని వారు దాదాపు ఉండరేమో. ఒకవేళ ఉన్నారంటే.. వాళ్లకు చాయ్ టేస్ట్ తెలియదని అర్థం. కప్పులో వేడివేడి చాయ్.. పక్కనే సమోసానో.. పకోడీనో ఉంటే ఆహా.. ఆ మజాయే వేరు. అది కాస్త అల్లం టీనో.. మసాలా చాయో అయితే మరింత హాయి. ఈ చాయ్ రుచి చేతిని బట్టి మారుతూ ఉంటుంది. కొందరు అల్లం వేసి అదరక్ చాయ్ చేస్తే.. మరికొందరు యాలకులు వేసి ఇలాచీ టీ చేస్తారు. ఇంకొందరు మసాలా చాయ్‌తో అప్పటిదాకా పడ్డ ఒత్తిడిని మరిపిస్తారు.
Telangana Tea Championship in Hyderabad: చాయ్ చేయడంలో మహిళలది అందె వేసిన చేయి. ఎన్ని రకాల వంటలనైనా ఒంటి చేత్తో.. అలసట లేకుండా చేసే ఆడవాళ్లు.. చాయ్‌ను మాత్రం ఎంతో ప్రేమతో తయారు చేస్తారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళల కోసం ఓ ప్రముఖ సంస్థ మార్చి 6న హైదరాబాద్‌లో.. తెలంగాణ టీ ఛాంపియన్‌షిప్-2022 పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. నీలోఫర్ కెఫేతో కలిసి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో రుచికరమైన చాయ్ చేసిన మహిళలకు ఆకర్షణీయమైన బహుమతులు పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. మొదటి విజేతకు రూ.లక్ష రూపాయల నగదు.. రెండో విజేతకు రూ.50వేలు, రన్నరప్‌కు రూ.25వేలు బహుమతిగా ఇవ్వనున్నారు.