పొట్టి క్రికెట్ మజాను పంటర్లు, బుకీలు సొమ్ము చేసుకుంటున్నారు. దుబాయ్, అబుదాబిల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతుంటే ఇక్కడ రూ.లక్షల్లో బెట్టింగ్ జరుగుతోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్, ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య బుధవారం జరిగిన టీ20 క్రికెట్ మ్యాచ్ సందర్భంగా వేర్వేరు ప్రాంతాల్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు నిందితులు పోలీసులకు చిక్కారు.
గురువారం సయ్యద్ సత్తార్, మహ్మద్ హసన్ అనే వ్యక్తులను దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి రూ.40వేలు, చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. పంటర్ సయ్యద్ కలీమ్ పారిపోయాడు. ఇక ఇంట్లోనే బెట్టింగ్ నిర్వహిస్తున్న పాత నిందితుడు ఎన్.విజయ్‌కుమార్‌ను చుడీబజార్‌లో పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకొని టీవీ, సెట్‌టాప్ బాక్స్, రూ.32,500 నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఏకకాలంలో 50 మందితో.. బెట్టింగ్ నిర్వహణకు పంటర్లు ఇళ్లు, ఫ్లాట్లను ఎంచుకుంటున్నారు. గోవాలోని క్యాసినోలలో ఉంటూ హైదరాబాద్‌లో తమ అనుచరుల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ల్యాప్‌ట్యాప్‌లో బెట్టింగ్ సాఫ్ట్‌వేర్‌కు కనీసం 30 చరవాణులను అనుసంధానం చేసి ఏకకాలంలో 50 మందితో కట్టించుకుంటున్నారు. ప్రతి బంతి, ఓవర్, వికెట్ పేరిట రూ.లక్షల్లో పందాలు ఉంటున్నాయి.
బెట్టింగ్ రాకెట్లు పదుల సంఖ్యలో ఉన్న ప్రాంతాలు:బేగంబజార్, షాహినాయత్‌గంజ్, అఫ్జల్‌గంజ్, సికింద్రాబాద్, బోయిన్‌పల్లి
బెట్టింగ్ జరిగే సిరీస్‌లు: * అంతర్జాతీయ వన్డేలు * టీ 20 * ఐపీఎల్