కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాజధాని నుంచి చాలా మంది తమ స్వస్థలాకు వెళ్లిపోతున్నారు. ఇళ్లు ఖాళీ చేసిన వారితో, వారి సామాన్లతో రోజుకు ఎక్కువ సంఖ్యలో వాహనాలు హైదరాబాద్-విజయవాడ రహదారి మీదుగా వెళుతున్నాయి. పంతంగి టోల్‌ప్లాజా వద్ద బారులు తీరుతున్నాయి. సాధారణంగా రోజుకు మూడొందల లోపు సరకు రవాణా పెద్ద ఆటోలు (టాటాఏస్) ఈ రహదారి నుంచి రాకపోకలు సాగించేవి.
ఇప్పుడు 1,200-1,500 వరకు వెళుతున్నాయి. ఛార్జీల భారం భరించలేక, డబ్బుల ఇబ్బందితో కొందరు సొంతూరు నుంచి ట్రాక్టర్లు, ఆటోలు తెప్పించుకుంటున్నారు. డీజిల్ రేట్లు పెరగడం వల్ల కూడా సరకు వాహనాల ఛార్జీలు పెరిగాయని హైదరాబాద్ నుంచి కాకినాడకు వెళ్తున్న ఆటోడ్రైవర్ శ్రీశైలం చెప్పారు. విజయవాడకు రూ.12 వేల వరకు, శ్రీకాకుళంకు రూ.17 వేల వరకు ఛార్జీలను వసూలు చేస్తున్నారు.
ఏ ప్రాంతాల వారు ఎక్కువగా వెళ్తున్నారంటే..
ఏపీలోని విజయవాడ, శ్రీకాకుళం, భీమవరం, కాకినాడ, రాజమహేంద్రవరం, తెలంగాణలోని ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ ప్రాంతాలకు చెందిన వారు వెళ్తున్నారు. ప్రైవేట్ పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులతో పాటు భవన నిర్మాణ రంగంపై ఆధారపడి పని చేసే వృత్తుల వారు, అడ్డా మీద కూలీలు సొంతింటి బాట పడుతున్నారు.
ఊరెళ్లాక పనిచేసి.. ఆటో కిరాయి చెల్లిస్తా
ఈ చిత్రంలో వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరానికి చెందిన రాము. ఇల్లు ఖాళీ చేసి ఆటోలో సొంతూరు వెళుతున్నారు. ‘హైదరాబాద్‌లో మేస్త్రీ పని చేశా. నాలుగు నెలలుగా పనిలేదు. మూణ్నెల్ల నుంచి చేతిలో పైసల్లేవు. ఇంటి అద్దె కట్టలేకపోయా. పస్తులున్నా. సొంతూరు పోవాలంటే చేతిలో చిల్లి గవ్వ లేదు. మా ఊర్లోని ఆటోడ్రైవర్‌ను బతిమిలాడితే నా పరిస్థితి చూసి వచ్చాడు. ఊరెళ్లాక ఏదో ఒక పని చేసి ఆటో కిరాయి చెల్లిస్తా’ అంటూ ఆవేదన చెందారు.
ఐటీ ఉద్యోగులదీ వలసబాట..
కరోనా నేపథ్యంలో ఐటీ కార్యాలయాలన్నీ ఇంటి నుంచి పని చేసే విధానాన్ని అమలు చేస్తున్నాయి. మరో మూడు, నాలుగు నెలల వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం. వారు ఎక్కడి నుంచైనా ల్యాప్‌టాప్‌ల ద్వారా లాగిన్ అయ్యేందుకు కంపెనీలు అనుమతిస్తున్నాయి. దీంతో ఐటీ ఉద్యోగుల్లో చాలామంది స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. హైదరాబాద్‌లో ఉండే కన్నా సొంతూళ్లో కుటుంబ సభ్యుల మధ్య ఉంటే ఇక్కడ ఇంటి అద్దె ఆదా చేయవచ్చన్న అభిప్రాయంతో కొందరు ఇళ్లు కూడా ఖాళీ చేస్తున్నారు.