Discount in Traffic Challan: జరిమానాల భారంతో సతమతమవుతున్న ట్రాఫిక్ ఉల్లంఘనులకు పోలీస్‌శాఖ ఊరట కల్పించింది. బకాయిల్ని 50-75 శాతం రాయితీతో చెల్లించి కేసుల నుంచి తప్పించుకునే అవకాశం కల్పించింది. హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టాన్ని అనుసరించి ప్రస్తుతానికి రాజధాని పరిధిలో మార్చి 1 నుంచి నెలాఖరు వరకు ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. అనంతరం రాష్ట్రమంతటా అనుమతించే అవకాశముంది. రాష్ట్రవ్యాప్తంగా వర్తింపచేయాలంటే డీజీపీ అనుమతి అవసరం. ప్రస్తుతం సెలవులో ఉన్న డీజీపీ మహేందర్‌రెడ్డి మార్చి 5న విధుల్లో చేరనున్నారు. అప్పుడు ఈ సదుపాయాన్ని రాష్ట్రవ్యాప్తం చేయనున్నారు. రాయితీతో జరిమానా సొమ్ము చెల్లించేందుకు సంబంధిత వెబ్‌సైట్‌లో కొత్త ఫీచర్‌ను జోడించి ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో నమోదైన జరిమానాలకు రాయితీ వర్తింపజేయనున్నారు.
8 ఏళ్లు.. రూ.2,671 కోట్ల జరిమానాలు
- రాష్ట్రం ఆవిర్భవించాక.. గత ఎనిమిదేళ్లలో 8.79 కోట్ల ఉల్లంఘనలకు సంబంధించి రూ. 2,671 కోట్ల మేర జరిమానాలు విధించారు. ఇందులో రూ. 900 కోట్లే (33%) వసూలయ్యాయి. మిగిలిన రూ. 1,770 కోట్ల మేర వసూలు కోసం తాజాగా రాయితీతో అవకాశం కల్పించారు.
- బకాయిల్లో.. ద్విచక్ర వాహనదారుల వాటానే అధికం. వీరు చెల్లించాల్సిన మొత్తం రూ. 1200 కోట్ల మేర ఉంది. ఈ బకాయిలకు 75% రాయితీ వర్తింపజేశారు. అంటే వీరు రూ. 300 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. మిగతా వాహనాలకు సంబంధించి మరో రూ. 200-300 కోట్లు కలిపి మొత్తం రూ. 500-600 కోట్లు వసూలయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా.
- కరోనా ఉద్ధృతి సమయంలో మాస్క్‌లు ధరించని వారికి రూ. 1,000 చొప్పున సుమారు రూ. 200 కోట్ల మేర జరిమానాలు విధించారు. ఇప్పుడు రూ. 100 చొప్పున చెల్లించే అవకాశం కల్పించారు. అంటే రూ.20 కోట్లు చెల్లిస్తే సరిపోతుంది.