Racing in Hyderabad : అత్యంత వేగం.. ఒక్క చక్రంపైనే గాలిలో చక్కర్లు.. ఇలా హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో రేసింగ్‌ల జోరు కొనసాగుతోంది. యూట్యూబ్‌లో స్టంట్లు చూసి విన్యాసాలు చేస్తున్నారు. రాత్రైతే చాలు 10-20 మంది యువకులు, విద్యార్థులు స్పోర్ట్స్ బైకులు, కార్లతో ఎంపిక చేసుకున్న ప్రాంతాలకు వెళ్తున్నారు. తాజాగా ఆటో డ్రైవర్లూ రేసులు నిర్వహిస్తున్నారు. రాత్రి 10 నుంచి తెల్లవారుజాము వరకూ కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌తోపాటు ఇతర మెట్రో నగరాలైన ముంబయి, బెంగళూరు, చెన్నైలలోనూ ఇదే పరిస్థితి ఉండగా అక్కడ కొంత కట్టడి ఉంది. నగరంలో అప్పుడప్పుడు పోలీసులు తనిఖీలు నిర్వహించి జరిమానాలు విధిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఆరుగురిని అరెస్ట్ చేశారు.
Racing in Hyderabad : రాత్రయితే రేసులు.. ప్రాణాలతో ఆటలు - హైదరాబాద్‌లో బైక్ రేసింగ్
Racing in Hyderabad : యూట్యూబ్‌లో వీడియోలు చూడటం.. అవే విన్యాసాలు బయట చేయడం.. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అర్ధరాత్రి పూట యువకులు డెడ్లీ స్టంట్లు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రమాదాల బారిన పడటమే కాకుండా.. ఇతరుల ప్రాణాలకు హానీ కలిగిస్తున్నారు. వీరిపై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు తనిఖీలు చేపడుతూ జరిమానాలు విధిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అరెస్ట్ చేస్తున్నారు.
Racing in Hyderabad
నగరంలో ఎక్కడెక్కడంటే..
- BikeRacing in Hyderabad : రహదారులపై బైక్ రేసులు, కార్ల పరుగు పందేలను నిర్వహించేందుకు కొన్ని బృందాలు ప్రత్యేకంగా ఉన్నాయి. మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకూ; జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి నాగార్జున సర్కిల్ వరకూ; జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి అపోలో ఆసుపత్రి మీదుగా కేబీఆర్ పార్క్ కూడలి వరకూ వీటిని నిర్వహిస్తున్నారు.
- బాహ్యవలయ రహదారుల సర్వీస్‌రోడ్లు, శంషాబాద్ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో మెర్సిడెస్ బెంజ్, ఆడీ, పోర్షీ, బీఎండబ్ల్యూ, రేంజ్‌రోవర్ కార్ల పందేలు జరుగుతున్నాయి.
- చాంద్రాయణగుట్ట ఫ్లైవోవర్, ఆరాంఘర్, రాజేంద్రనగర్ రహదారులపై అర్ధరాత్రి దాటాక ఆటోడ్రైవర్లు రేసులు నిర్వహిస్తున్నారు.
- శివారు ప్రాంతాల్లో నార్సింగి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మేడ్చల్, కొంపల్లి ప్రాంతాల్లో బైక్‌లతో పందేలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు పందెం నడుస్తోంది. ఇవన్నీ పోలీసులకు తెలిసినా కొందరు కేసులు నమోదు చేస్తుండగా ఇంకొందరు చూడనట్టు వ్యవహరిస్తున్నారు.
ముంబయి, బెంగళూరుల్లో కట్టడి ప్రయత్నాలిలా..
- CarRacing in Hyderabad : ముంబయిలో బైకులు, కార్లు, ఆటోల రేసులు మెరైన్‌డ్రైవ్, బాంద్రా రిక్లమేషన్, వొర్లి ప్రాంతాల్లో జరుగుతున్నాయి. రేసర్లను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు పోలీసులు అక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
- బెంగళూరు పోలీసులు ఎలక్ట్రానిక్‌సిటీ, కోరమంగళ ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న రేసులను నియంత్రించేందుకు పట్టుబడిన వారి నుంచి రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరకూ బాండ్ రాయించుకుంటున్నారు. ప్రమాదకర డ్రైవింగ్ చేస్తున్నందుకు ఐపీసీ 279 కింద కేసు పెడుతున్నారు. ఏడేళ్ల వరకు జైలు శిక్షకు అవకాశం ఉంది. ఇతరుల ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నారని సీఆర్‌పీసీ107 సెక్షన్ కింద కేసు నమోదు చేస్తున్నారు.
- హైదరాబాద్‌లో కట్టడికి ఇలాంటి చర్యలు లేవు. రేసులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి? రాత్రి వేళల్లో యువకులు ఎక్కడ ఉంటున్నారు? అన్న అంశాలపై పోలీసులు నిఘా ఉంచి కొద్దిరోజుల పాటు వరుసగా తనిఖీలు నిర్వహించడం, రేసర్లపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తే ప్రమాదాల తీవ్రత తగ్గే అవకాశాలున్నాయి.
- ఇదీ చదవండి :హైదరాబాద్‌లో మళ్లీ మొదలైన బైక్ రేసింగ్‌లు