హైదరాబాద్లో ప్రజా రవాణా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజామున, మధ్యాహ్నం, రాత్రి 8 గంటల తర్వాత బస్సుల సంఖ్య తక్కువగా ఉన్నా.. కార్యాలయాల సమయంలో అయినా పూర్తిస్థాయిలో నడపాలని కోరుతున్నారు.
కిక్కిరిసిన బస్సుల్లో.. ప్రయాణికుల తిప్పలు... - Hyderabad people demands for full length public transport
ప్రజా రవాణా పూర్తిస్థాయిలో అందుబాటులో లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కిక్కిరిసిన బస్సుల్లో నిల్చుని వెళ్లలేక ఇంకో బస్సు కోసం ఎదురు చూడలేక తిప్పలు పడుతున్నారు. నగరంలో సగం బస్సులే నడుస్తుండటంతో ఈ పరిస్థితి నెలకొంది.
ఏడాది క్రితం నగరంలో 42 వేల ట్రిప్పులుండేవి. తక్కువ దూరం ఉండే ట్రిప్పులను కొన్నింటిని రద్దు చేయడంతో 33 వేల ట్రిప్పులను చేశారు. ఈ ట్రిప్పులన్నీ తిరగాలంటే.. గ్రేటర్‌జోన్‌లో ఉండే బస్సులన్నీ రోడ్డెక్కాలి. కరోనా సాకు చూపి ప్రస్తుతం 50 శాతం బస్సులనే నడుపుతున్నారు. గ్రేటర్‌హైదరాబాద్ ఆర్టీసీ జోన్ పరిధిలో అద్దె బస్సులు 500 వరకూ ఉన్నాయి. ఈ బస్సుల్లో 25 శాతం నడిపేందుకు ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
పెరగని రూట్లు..
నగరంలో దశాబ్ద కాలంగా 1127 రూట్లలో బస్సులు తిరుగుతున్నాయి. కొత్త కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీల ప్రాంతాలకు కొత్త బస్సులు వేసే పరిస్థితి లేదు. కొత్త బస్సులు సమకూరితే అప్పుడు నూతన మార్గాల గురించి ఆలోచిస్తామని అధికారులు తెలిపారు.