హైదరాబాద్ ఎల్బీనగర్లోని ఆటోనగర్ డంపింగ్ యార్డులో చెత్త వేయడం తగ్గినా... జంతు కళేబరాలు మాత్రం ఆగడం లేదు. రాత్రికి రాత్రే గుర్తు తెలియని వ్యక్తులు... వ్యర్థాలను వదిలి వెళ్తున్నారు. తెల్లవారేలోపు గుట్టలు గుట్టలుగా కనిపిస్తున్నాయి.
కళేబరాలు ఖననం చేయట్లేదు
ఆటోనగర్‌లోని 10 కాలనీలు అత్యంత దుర్గంధపూరితంగా మారాయి. వర్షాలు కురిసిన సమయంలో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వాస్తవంగా నగరంలో చనిపోయిన జంతు కళేబరాలు ఆటోనగర్ డంపింగ్ యార్డుకు తీసుకొచ్చి ఖననం చేయాల్సి ఉంటుంది. అయితే ఈ కాంట్రాక్ట్ పొందిన వ్యక్తులు మాత్రం ఇక్కడి వరకు తీసుకువచ్చి వదిలివెళ్తున్నారు. దీనివల్ల సమీపంలోని కాలనీలు దుర్వాసనతో నిండిపోతున్నాయి.
ఆ గాలి సోకినా అనారోగ్యమే..!
ఈమధ్య కాలంలో సమస్య మరింత తీవ్రంగా మారింది. చుట్టుప్రక్కల కాలనీల ప్రజలు తీవ్ర అనారోగ్య సమ్యలతో సతమతం అవుతున్నారు. గాలి వీచినప్పుడు సమస్య మరింత ఎక్కువ అవుతోందని స్థానికులు చెబుతున్నారు. చనిపోయిన జంతువులను తిన్న కుక్కలు వచ్చి అవి రోగాల బారిన పడి కాలనీల్లో తిరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇంట్లో ఉండలేం.. బయటకెళ్లలేం..!
ఇటీవల 40 లక్షలు పెట్టి అనేక మంది ఇక్కడ అపార్టుమెంట్లు తీసుకున్నామని కానీ ఇక్కడకు వచ్చి అనారోగ్యం పాలౌతున్నామని వాపోతున్నారు. 6 నెలల నుంచి ఎన్నో ఫిర్యాదు ఇచ్చినా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.