అగ్నిపథ్ ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో మెట్రో రైళ్లు రద్దు - అగ్నిపథ్ పథకం
13:06 June 17
హైదరాబాద్‌లో మెట్రో రైళ్లు రద్దు
అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆందోళన హైదరాబాద్‌లో ఉద్రిక్తతకు దారితీసింది. సికింద్రాబాద్ రైల్వే ప్రాంగణమంతా రణరంగంలా మారింది. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడం, రైళ్లు, బస్సులపై రాళ్లతో దాడి చేయడం, రైళ్లు తగులబెట్టడం, బైక్‌లకు నిప్పంటించడంతో ఆ ప్రాంతమంతా రణరంగాన్ని తలపించింది.
సికింద్రాబాద్‌లో ఆందోళన దృష్ట్యా హైదరాబాద్ మెట్రో అప్రమత్తమైంది. హైదరాబాద్ మెట్రో రైళ్లు రద్దు చేస్తున్నట్లు మెట్రో యాజమాన్యం ప్రకటించింది. అన్ని మార్గాల్లో మెట్రో సేవలు రద్దు చేస్తున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. దీనివల్ల ఇవాళ ఆఫీసులు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లిన వారంతా ఇబ్బందులు ఎదుర్కొనున్నారు. ఆందోళన దృష్ట్యా మెట్రో స్టేషన్లలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
- 'అగ్నిపథ్'పై హైదరాబాద్ ఆగ్రహం.. రణరంగంలా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్
- పోలీసుల కాల్పుల్లో ఒకరు మృతి.. 8 మందికి గాయాలు
మరోవైపు ఎంఎంటీఎస్ రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్లు అధకారులు ప్రకటించారు. 66 ఎంఎంటీఎస్(సబర్బన్) సర్వీసులు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఫలక్‌నుమా నుంచి లింగంపల్లి వెళ్లే 12 ఎంఎంటీఎస్ రైళ్లు, లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్లే 13 ఎంఎంటీఎఏస్ రైళ్లు రద్దు చేసినట్లు కాచిగూడ స్టేషన్ డైరెక్టర్ ప్రభుచరణ్ వెల్లడించారు. ఆరు ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 4 రైళ్లు పాక్షికంగా రద్దు చేశామని.. ఇప్పటి వరకు రెండు రైళ్లు దారిమళ్లించినట్లు చెప్పారు. మెట్రో, ఎంఎంటీఎస్ రద్దు వల్ల నగర ప్రయాణికులకు తిప్పలు తప్పవు.