హైదరాబాద్ మహానగరానికి మణిహారంగా మారిన మెట్రో రైలు ప్రాజెక్టులో మరో కీలక మార్గం రేపటి నుంచి అందుబాటులోకి రానుంది. నగరంలోని ప్రధాన బస్టాండ్లు అయిన జేబీఎస్, ఎంజీబీఎస్‌ను అనుసంధానం చేస్తూ 11 కిలోమీటర్ల పొడవునా నిర్మించారు. రేపు సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీంతో మొత్తం 69 కిలోమీటర్లు మెట్రో మార్గం అందుబాటులోకి రానుంది.
2012లో రూ.14 వేల 132 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టు 2017 జులై నాటికే పూర్తి కావాల్సి ఉంది. ఆస్తుల సేకరణ, కోర్టు కేసులు, అలైన్ మెంట్ వివాదాలతో జాప్యం జరిగింది. వాటన్నింటిని అధిగమించి మూడేళ్లు ఆలస్యంగా మూడు కారిడార్లను ఎల్ అండ్ టీ సంస్థ పూర్తి చేసింది.